నిడమనూరు గురుకులంలో కలకలం.. బాలికల పట్ల అసభ్య ప్రవర్తన

కలం, నల్లగొండ: నల్లగొండ జిల్లా నిడమనూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాల (Nidamanur Gurukul College)లో తీవ్ర కలకలం రేగింది. పవిత్రమైన చదువుల గుడిలో బాలికలకు భద్రత కరువైందనే ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గురుకులంలో పనిచేస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడు కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వారిపై చేతులు వేస్తూ అనుచితంగా వ్యవహరిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలికల భద్రతను గాలికొదిలేసి గురుకుల యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహించిందంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాల వద్దకు చేరుకున్నారు. గురుకులంలో బాలికల భద్రతను పర్యవేక్షించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తూ నల్లగొండ – హాలియా ప్రధాన రహదారిపై బైఠాయించి తీవ్ర స్థాయిలో ధర్నా నిర్వహించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల బాధ్యతను కూడా తేల్చాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

గురుకులంలో కలకలం, రహదారిపై తల్లిదండ్రుల ధర్నా సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తక్షణమే స్పందించారు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడైన పారిశుద్ధ్య కార్మికుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని సమగ్రంగా విచారిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో నిష్పాక్షిక విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

మరోవైపు ఈ ఘటన గురుకులాల్లో విధుల్లో ఉండే సిబ్బంది ప్రవర్తనపై, అధికారుల పర్యవేక్షణపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఉన్నతాధికారుల తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయా? విద్యార్థినులకు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే బాధ్యత ఎవరిది? అని స్థానికులు నిలదీస్తున్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి బాలికల నుంచి రహస్యంగా వాంగ్మూలాలు సేకరించాలని, గురుకులాల్లో పూర్తిస్థాయిలో భద్రతా ప్రమాణాలు పెంచాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>