కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆకస్మిక తనిఖీలు చేపట్టగా.. వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించిన హరీశ్ రావు.. డాక్టర్ అబ్బయ్య అనే వైద్యుడు రేపటి డ్యూటీకి సంబంధించి కూడా ముందే రిజిస్టర్‌లో సంతకం చేసి ఉండటాన్ని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా ఆయనకే ఫోన్ చేసి ఇదేంటని ప్రశ్నించారు. డాక్టర్ అబ్బయ్య తీరుపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
సంతకాలు పెట్టి వెళ్లిపోతారా..?
ఎమర్జెన్సీ విభాగంలో పనిచేయాల్సిన పలువురు డాక్టర్ల సంతకాలు రిజిస్టర్‌లో ఉండటాన్ని గుర్తించిన హరీశ్ రావు.. వారు అటు ఆసుపత్రిలో, లేకపోతే క్షేత్రస్థాయిలో విధుల్లో లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ డాక్టర్లే ఆసుపత్రిలో అందుబాటులో లేకపోతే అత్యవసర పరిస్థితిలో వచ్చే రోగులకు వైద్యం ఎలా అందుతుందని అని అధికారులను నిలదీశారు. రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి ఆసుపత్రిలో లేకుండా పోయిన వైద్యులకు హరీశ్ ఫోన్ చేసి మాట్లాడారు. డ్యూటీ సమయంలో ఆసుపత్రిలో ఉండకుండా ఎక్కడకు వెళ్లారంటూ మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

