కలం, ఖమ్మం బ్యూరో: రోడ్లపై ప్రాణాలను పణంగా పెట్టి బైక్ స్టంట్లు చేస్తూ ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తున్న యువకుడిపై ఖమ్మం అర్బన్ పోలీసులు (Khammam Police) కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్న బానోత్ ఆనంతు (23) అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు అర్బన్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు, నగరంలో బైక్ స్టంట్లు చేసే అసాంఘిక కార్యకలాపాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలపేట ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఎస్సై వరాలు శ్రీనివాస్, అర్బన్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 250 సీసీ బైక్‌తో రోడ్లపై ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్న బానోత్ ఆనంతును అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. యువత ఇలాంటి ప్రమాదకర విన్యాసాలకు దూరంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలతో పాటు పీడీ యాక్ట్ వంటి తీవ్రమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిఘా విభాగాలు ఇలాంటి వారి కదలికలపై నిరంతరం దృష్టి పెట్టాయని స్పష్టం చేశారు.

