కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను గాడిలో పెట్టడం తనకు సవాల్‌గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుర్తు చేసుకున్నారు. గత పదేళ్లలో నిర్వహించిన అనేక పరీక్షల్లో గందరగోళం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న 113 మంది డీఎస్పీలతో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం టీజీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని.. ఆర్ఎంపీ డాక్టర్లను కమిషన్ సభ్యులుగా నియమించిందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
పాత కమిషన్ రద్దు చేసి..
అధికారంలోకి వచ్చిన వెంటనే యూపీఎస్సీ తరహాలోనే టీజీపీఎస్సీ(TGPSC)ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేశామని సీఎం రేవంత్ అన్నారు. స్వయంగా యూపీఎస్సీ ఛైర్మన్‌ను కలిసి.. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయడం ప్రారంభించామన్నారు. పాత బోర్డును రద్దు చేసి.. విద్యావేత్తలను మాత్రమే నియమించేలా చర్యలు చేపట్టామన్నారు. డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డిని ఛైర్మన్‌గా నియమించామన్నారు. నిరుద్యోగుల బాధలు తెలిసిన వ్యక్తినే నియమించాలనే ఉద్దేశంతో సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంను వీఆర్ఎస్ ఇప్పించి మరీ టీజీపీఎస్సీ ఛైర్మన్ చేశామన్నారు. కొత్త డీఎస్పీల ప్రక్రియ ఎంత సంక్లిష్టంగా మారిందో అందరికీ తెలిసిందేనన్నారు. 2011లో జరిగిన గ్రూప్–1 నియామకాలు, తాము వచ్చాకే మరోసారి పూర్తి చేశామన్నారు.
ప్రజలతో నేరుగా సంబంధాలు మీకే..
లక్షల మంది పోటీ పడితే మీకు మాత్రమే అవకాశం వచ్చిందని కొత్త డీఎస్పీలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పోలీస్ యూనిఫాం వేసుకోవాలన్న కలను నెరవేర్చుకున్నారని.. ఇక నుంచే అసలు పని మొదలవుతుందన్నారు. వచ్చే 30 ఏళ్ల పాటు ఎవరు ఏ స్థానంలో సేవలు అందించినా.. బాధ్యతగా పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో డీఎస్పీలకు ప్రజలతో నేరుగా సంబంధాలుంటాయన్నారు. ఎంతో మంది పేద కుటుంబాల నుంచి వచ్చినవారు ఉంటారని.. ఎప్పటికీ మనం వచ్చిన నేపథ్యం మర్చిపోవద్దన్నారను. వారంతా గర్వపడేలా పనిచేయాలన్నారు. నిన్నటి వరకు మీరంతా సామాన్యులే అని, ఇక నుంచి పెద్ద బాధ్యత ఉంటుందన్నారు. సమస్య తెలిసినప్పుడే పరిష్కారం సులభమవుతుందన్నారు.
Also Read : మంత్రి శ్రీధర్ బాబు పర్యటనకు సర్వం సిద్ధం
Follow Us On: X(Twitter)

