కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని తక్షణమే సంపూర్ణ కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) డిమాండ్ చేశారు. తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఆయన కోరారు. కరువు పరిస్థితులపై మంగళవారం కొత్తగూడెం (Kothagudem)లోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నా విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కూనంనేని, ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రస్తుతం దేశంలో, ప్రపంచంలో కరువు విలయతాండవం చేస్తోందని, రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని కూనంనేని హెచ్చరించారు. వేసవిలో వర్షాలు లేకపోవడం వల్ల ఈ కరువు ప్రభావం వచ్చే అక్టోబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించినట్లే జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యలను సమగ్రంగా గుర్తించాలని స్పష్టం చేశారు.
ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరవు సహాయక బృందాలను గ్రామాలకు పంపకపోవడం సరికాదని కూనంనేని అభిప్రాయపడ్డారు. ఊహాజనితంగా అంచనాలు వేయకుండా కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి బృందాలు అన్ని ప్రాంతాల్లో పర్యటించి శాస్త్రీయంగా నష్టాన్ని లెక్కించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేవలం 364 మండలాలకే కరువును పరిమితం చేయడం సరికాదని, మిగిలిన 256 మండలాలు సుభిక్షంగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, కరువును ఒక సమగ్ర విపత్తుగా పరిగణించాలని సీఎంను కోరారు. కేంద్ర ప్రభుత్వం సైతం తక్షణమే స్పందించి తగిన అంచనాల ఆధారంగా సహాయక నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వం కేవలం 16 మండలాలనే కరువు మండలాలుగా గుర్తించి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరు వెంకటేశ్వరరావు, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, సరెడ్డి పుల్లారెడ్డి, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

