Mobile Popup Ad
Mobile Popup Ad

నల్గొండ మున్సిపల్ సమావేశంలో అధికారులను నిలదీసిన కార్పొరేటర్లు

కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం తీవ్ర చర్చోపచర్చల మధ్య వాడిగా వేడిగా సాగింది. నగరంలోని పలు డివిజన్లలో నెలకొన్న ప్రజా సమస్యలపై కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులను నిలదీశారు. ముఖ్యంగా విద్యుత్, మంచినీరు, అండర్ ‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు గట్టిగా డిమాండ్ చేశారు. సమావేశం ప్రారంభం కాగానే పలు డివిజన్లలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులపై కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు నత్తనడకన సాగడంపై అధికారులను నిలదీశారు. “ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలి” అని పలువురు కార్పొరేటర్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

నగరంలో తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని వారు కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. కార్పొరేటర్ల ప్రశ్నలపై మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి (Burri Chaitanya Srinivas Reddy) సానుకూలంగా స్పందించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో ఎక్కడా నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ప్రత్యేక కార్యాచరణను చేపట్టామని ఆమె స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక సహకారంతో నల్లగొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, పెండింగ్ పనులను వేగవంతం చేసేందుకు నిధులు సైతం సిద్ధంగా ఉన్నాయని మేయర్ ఈ సందర్భంగా ప్రకటించారు. మున్సిపల్ సాధారణ సమావేశంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్‌తో పాటు నగర కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>