కలం, జోగులాంబ గద్వాల: జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన పెండింగ్ సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా (Collector Rizwan Basha) అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భూదాన్ భూములు, రీ-సర్వే, భూభారతి దరఖాస్తులు, కోర్టు కేసులు, భూసేకరణ, వివిధ రెవెన్యూ సేవలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
జిల్లాలో భూదాన్ భూములకు సంబంధించిన కేసులు ఆన్లైన్లో నమోదు కావాల్సి ఉందని పేర్కొంటూ, సంబంధిత అధికారులు వెంటనే వాటి వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. భూదాన్ భూములకు సంబంధించిన వివరాలను ఇతర భూముల నుంచి వేరు చేసి స్పష్టమైన జాబితా సిద్ధం చేయాలని, ధ్రువీకరించిన భూములు, తప్పులున్న వివరాలు, సంబంధిత పత్రాలు, అండర్టేకింగ్లను ప్రత్యేకంగా సమర్పించాలని సూచించారు.
రీ-సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి..
రీ-సర్వే చేపట్టిన గ్రామాల్లో సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికే సర్వే పూర్తయిన ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్లు, రికార్డులు, సంబంధిత వ్యక్తుల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న నోటీసులు, సర్వే నివేదికలు, భూముల సరిహద్దుల నిర్ధారణ వంటి అంశాలను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని సూచించారు.
జిల్లాలో భూభారతి కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తుల్లో అవసరమైన పత్రాలు లేని పక్షంలో వాటిని పెండింగ్లో ఉంచకుండా, నిబంధనల ప్రకారం లోపాలను తెలియజేస్తూ తిరిగి పంపించడం లేదా తిరస్కరించడం వంటి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పాత మాడ్యూల్లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలించి, అవసరమైన చోట కొత్త మాడ్యూల్లోకి మార్చి పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల వివరాలను సిసిఎంఎస్ పోర్టల్లో పూర్తిస్థాయిలో నమోదు చేయాలన్నారు.
భూసేకరణకు సంబంధించి ఇప్పటికే జారీ చేసిన అవార్డుల వివరాలను ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఖాతా నంబర్లు, సర్వే నంబర్లు, సేకరించిన భూమి విస్తీర్ణం, జారీ చేసిన అవార్డుల వివరాలు పరస్పరం సరిపోలేలా చూడాలని స్పష్టం చేశారు. భూసేకరణకు సంబంధించిన పెండింగ్ సమస్యలను గుర్తించి, అవసరమైన చోట సుమోటో దరఖాస్తులు నమోదు చేసి, నోటీసులు జారీ చేస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ధ్రువీకరణ పత్రాలను సకాలంలో మంజూరు చేయాలి..
జనన ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ వివరాల ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో మంజూరు చేయాలన్నారు. విద్యాసంస్థలకు సంబంధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. లాజిస్టిక్స్, పంపిణీకి సంబంధించిన పెండింగ్ వివరాలను వెంటనే సమర్పించాలన్నారు. భూసేకరణ పరిహారానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై భూయజమానులతో సమావేశాలు నిర్వహించి, చర్చల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు.
అన్ని మండలాల అధికారులు తమ పరిధిలోని పెండింగ్ దరఖాస్తులు, వాటి ప్రస్తుత స్థితి, పరిష్కరించిన అంశాలు, పరిష్కారానికి ఎదురవుతున్న సమస్యలతో కూడిన స్పష్టమైన నివేదికలను వచ్చే మంగళవారం నాటికి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సమాచారం అందుబాటులో లేని పక్షంలో అందుకు సంబంధించిన కారణాలను స్పష్టంగా నివేదికలో పేర్కొనాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డిఓ శ్రీనివాసరావు, సర్వే ఏడి నూకరాజు, కలెక్టరేట్ ఏవో మంజుల, వివిధ మండలాల తహసిల్దారులు, తదితరులు పాల్గొన్నారు.

