వామ్మో.. ధాన్యం కొనుగోలు సెంటర్లు..!

కలం, నల్లగొండ బ్యూరో : అతడు రైతుకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలవాల్సిన కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు. కానీ అటు మిల్లర్ల మొండితనం.. ఇటు అధికారుల నిర్లక్ష్యం.. మధ్యలో రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఆ వారధి కుప్పకూలింది. కనగల్లు మండలం బచ్చన్నగూడెంలో ఐకేపీ సెంటర్ (IKP Center) ఇంచార్జ్ సైదులు ఆత్మహత్యాయత్నం ఘటన జిల్లాలో ధాన్యం కొనుగోలు వెనుక ఉన్న చీకటి కోణాలను బట్టబయలు చేసింది. రైతు పండించిన ప్రతి గింజను కాపాడాల్సిన వ్యవస్థే.. తరుగు పేరుతో వారి రక్తాన్ని పిండుతుంటే.. తట్టుకోలేక ఒక సామాన్య ఉద్యోగి పురుగుల మందు తాగడం ఇప్పుడు నల్లగొండ జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తూకం పేరుతో ‘తాలు’ రాజకీయం..

నిజానికి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఒక పెద్ద మిస్టరీగా మారింది. కొనుగోలు కేంద్రాల్లో 40 కేజీల బస్తాపై కనీసం 2 నుండి 5 కేజీల వరకు అదనపు తూకం వేయడం ఇప్పుడు అక్కడ అనవాయితీగా మారింది. ఒక రైతు 100 బస్తాలు అమ్మితే.. సగటున 2 క్వింటాళ్ల ధాన్యాన్ని ఉచితంగా మిల్లర్ల పాలు చేయాల్సి వస్తోంది. కొన్ని కేంద్రాల్లో ఐదు క్వింటాళ్ల ధాన్యం అదనంగా ఇవ్వాల్సి వస్తోంది. అంటే ఒక్కో రైతు కష్టార్జితం నుండి కనీసం రూ. 5వేల నుంచి రూ. 10వేల వరకు మిల్లర్ల జేబుల్లోకి వెళ్తోంది. అయితే “క్వింటాకు రెండు కిలోలు అదనంగా ఇస్తే.. మిల్లుల్లో ఏ పేచీ లేకుండా లారీలు దిగేలా చూస్తాం” అని ఆర్డీవో స్థాయి అధికారులే స్వయంగా రైతులకు సర్దిచెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. ఇది రైతుకు రక్షణగా ఉండాల్సిన వ్యవస్థే.. దోపిడీకి మధ్యవర్తిత్వం వహిస్తోందని నిరూపిస్తోంది.

మరోవైపు అధికారులు కేవలం రైతులను శాంతింపజేయడానికే హామీలు ఇస్తున్నారు తప్ప, మిల్లర్ల వద్దకు వెళ్లేసరికి వారి గొంతు పెరగడం లేదు. ఇది పరోక్షంగా మిల్లర్ల దోపిడీకి అధికారులే సహకరిస్తున్నారనే ఆరోపణలకు బలము చేకూరుస్తోంది. వందల సార్లు ఫోన్ చేస్తే తప్ప లారీలు రాకపోవడం.. సకాలంలో బస్తాలు అందకపోవడం వల్ల కేంద్రాల నిర్వాహకులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడం లేదనేది బహిరంగ రహస్యం. అటు రైతుల ఆగ్రహం, ఇటు మిల్లర్ల మొండితనం, మధ్యలో అధికారుల వేధింపుల మధ్య సైదులు వంటి చిరుద్యోగులు బలిపశువులవుతున్నారు.

రాజకీయ రొంపిలో వరి ధాన్యం

కనగల్లు మండలం బచ్చన్నగూడెం ఐకేపీ కేంద్రం (IKP Center) ఇంచార్జ్ సైదులు ఆత్మహత్యాయత్నం తర్వాత జిల్లాలో రాజకీయం వేడెక్కడం గమనార్హం. బీజేపీ నేత పిల్లి రామరాజు యాదవ్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వంటి నేతలు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్లతో కుమ్మక్కైన తీరును ఎండగడుతున్నారు. ఆసుపత్రుల్లో కూడా సరైన చికిత్స అందకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు. మొత్తం జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న మానసిక క్షోభకు నిదర్శనమని చెప్పాలి.

అసలు మిల్లర్లు అదనపు తూకం అడిగే హక్కు ఎవరిచ్చారు? నిబంధనల ప్రకారం 40 కేజీల బస్తాకు అదనంగా 600 గ్రాముల లోపే తూకం వేయాలి. కానీ ఒక్కో బస్తాకు 2 కేజీల నుంచి 5 కేజీల తీయడం వెనుక ఆంతర్యం ఏంటి. మిల్లర్లకు అధికారులు ఎందుకు వంత పాడుతున్నారు?. ఇదిలావుంటే.. జిల్లా కలెక్టర్ నుండి క్షేత్రస్థాయి అధికారుల వరకు అందరికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ అక్రమాలు తెలుసు. అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. రైతులను ఒప్పించిన అధికారులు, మిల్లర్లను ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? మిల్లు యజమానుల వెనుక ఉన్న రాజకీయ శక్తులే అధికారుల నోళ్లు మూయిస్తున్నాయా?. కావాలనే లారీలు పంపకుండా బస్తాల కొరత సృష్టించి కేంద్రాల నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అటు రైతుల ఆగ్రహం భరించలేక.. ఇటు అధికారుల వేధింపులు తాళలేక ఆపరేటర్లు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు.

Read Also: ‘బాబోయ్.. ఇక్కడ ఉండలేం!’.. అమెరికా వద్దంటున్న భారతీయులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>