కలం, నల్లగొండ బ్యూరో : అభివృద్ధి పేరిట సాగుతున్న అనాలోచిత పనులు.. సామాన్య ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నల్లగొండ (Nalgonda) పట్టణ నడిబొడ్డున ఉన్న లతీఫ్ సాహెబ్, బ్రహ్మంగారి గుట్టలపై ఘాట్ రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ల ఘోర నిర్లక్ష్యం కారణంగా విచక్షణారహితంగా జరిగిన బాంబు పేలుళ్లు.. కింద ఉన్న కాలనీలను అతలాకుతలం చేశాయి. నివాస గృహాలపై బండరాళ్లు వర్షంలా పడటంతో ఇళ్ల స్లాబ్‌లు పగిలిపోయి, స్థానికులు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. గుట్టలపై ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు భారీ శబ్దం.. గాల్లోకి లేచిన బండరాళ్లు ఇండ్లపైకి దూసుకొచ్చాయి. అయితే ప్రజలు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నల్లగొండ బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్ సాహెబ్ గుట్టలపై కాంట్రాక్ట్ ఏజెన్సీల అడ్డగోలు బ్లాస్టింగ్స్ తీరుతో నిబంధనలను మైనింగ్ అధికారులు ఎలా గాలికి వదిలేశారో స్పష్టం చేస్తున్నాయి. ఇళ్లు ధ్వంసమై, జనం భయాందోళనల్లో ఉన్నా.. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం. లతీఫ్ సాహెబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్టలపై ఘాట్ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 28 కోట్లకు పైగా కేటాయించింది. ఇంత భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో భద్రత మాత్రం ‘శూన్యం’ అని శనివారం హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన బాంబు బ్లాస్టింగ్ ప్రమాదం నిరూపించింది. కాంట్రాక్టర్ల లాభాల కక్కుర్తి, అధికారుల కమిషన్ల కక్కుర్తి కలిసి.. అమాయక ప్రజల ఇళ్లపైకి మృత్యువులా బండరాళ్లను విసిరాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నివాస గృహాలపై బండరాళ్ల వర్షం
బ్రహ్మంగారి గుట్టల కింద భాగంలో ఉండే కాలనీలపై ఈ పేలుళ్ల ప్రభావం తీవ్రంగా పడింది. గుట్టలపై నుంచి ఎగిరిపడిన భారీ బండరాళ్లు శనివారం సాయంత్రం సమయంలో నేరుగా స్థానికుల ఇళ్లపై పడ్డాయి. బండరాళ్లు పడిన వేగానికి ఇళ్ల కాంక్రీట్ స్లాబ్‌లు పెద్ద రంధ్రాలు పడి, పగిలిపోయాయి. ఇళ్ల లోపల బెడ్‌రూమ్‌లలో, మంచాలపై కాంక్రీట్ పెచ్చులు, రాళ్లు విరిగిపడ్డాయి. ఆ సమయంలో ఇళ్లలో ఉన్న మహిళలు, పిల్లలు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఒక్కసారిగా సంభవించిన భారీ శబ్దాలు, ఇళ్లపై పడుతున్న రాళ్లతో భూకంపం వచ్చిందేమోనన్న భయంతో కాలనీవాసులు ఇళ్లను వదిలి ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.
అడ్డగోలుగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్
సాధారణంగా జనవాసాలు, పట్టణ నడిబొడ్డున ఉన్న కొండలను బద్దలు కొట్టేటప్పుడు మైనింగ్, మున్సిపల్ నిబంధనల ప్రకారం అత్యంత కఠినమైన నియమాలు పాటించాలి. కానీ, క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్లు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనడానికి ఈ ఘటన నిదర్శనంగా మారింది. భారీ పేలుళ్లు జరిపినప్పుడు రాళ్లు గాల్లోకి ఎగిరిపోకుండా ఉండేందుకు వైర్ మెష్ లేదా భారీ రబ్బరు మ్యాట్లను పేలుడు స్థలంలో కప్పాలి. కానీ ఇక్కడ అలాంటి రక్షణ చర్యలేవీ తీసుకోకుండానే విచ్చలవిడిగా బ్లాస్టింగ్ చేశారు. నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉన్నప్పుడు తక్కువ తీవ్రత గల, శబ్దం లేని, నియంత్రిత (కంట్రోల్ బ్లాస్టింగ్) విధానాలను వాడాలి. కానీ నిబంధనలను పాటించకుండా భారీ స్థాయిలో మందుపాతరలు వాడినట్లు స్పష్టమవుతోంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్లను ధ్వంసం చేస్తూ, ప్రాణాలను పణంగా పెడుతూ చేసే అభివృద్ధి తమకొద్దని మండిపడుతున్నారు.
అధికారుల కమిషన్ల నిద్ర.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
పట్టణ నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ బ్లాస్టింగ్స్ జరుగుతుంటే.. పర్యవేక్షించాల్సిన మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం, మైనింగ్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? అని, కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఇచ్చే భారీ కమిషన్ల మత్తులో అధికారులు జోగుతున్నారనే అనుమానాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. అందుకే కాంట్రాక్టర్లు కనీసం చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తం చేయకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బాంబులు పెడుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదని ఆరోపిస్తున్నారు. కాగితాల్లో మాత్రం అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు రికార్డులు సృష్టించి, సేఫ్టీ బిల్లులను సైతం డ్రా చేసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. రూ. 28 కోట్ల బడ్జెట్ ఉన్న ప్రాజెక్టులో కనీసం రూ. 50 వేల విలువైన రక్షణ మ్యాట్లను ఎందుకు వాడలేదు? ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?. నివాస ప్రాంతాల మధ్య భారీ పేలుళ్లకు అనుమతి ఇచ్చిన మైనింగ్ అధికారులు సమాధానం చెబుతారా?. ప్రమాదం జరిగి ఇళ్లు ధ్వంసమైనా, ఇప్పటివరకు కాంట్రాక్ట్ ఏజెన్సీపై మున్సిపల్ అధికారులు ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోలేదు? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే వారే కరువయ్యారు. ”ఆధునిక సురక్షిత సాంకేతికతతో మాత్రమే పనులు ముందుకు సాగేలా కఠిన నిబంధనలు అమలు చేయాలి. రూ. 28 కోట్ల ఘాట్ రోడ్డు ప్రాజెక్టులో జరిగిన నిధుల కేటాయింపులు, భద్రతా లోపాలపై తక్షణమే విజిలెన్స్ విచారణ జరగాలి. కాంట్రాక్టర్ల లాభాల దందాకు బ్రేక్ వేసి, ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ ఇచ్చే వరకు పనులను నిలిపివేయాలని, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలి” అని నల్లగొండ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

