కలం, ఖమ్మం బ్యూరో: మీసేవ కేంద్రాల్లో అదనపు డబ్బులు వసూలుచేస్తే కఠినచర్యలు తప్పవని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు హెచ్చరించారు. వివిధ ధ్రువపత్రాల కోసం వచ్చే దరఖాస్తులను ఇకపై ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారానే తనిఖీ చేయనున్నట్టు తెలిపారు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఎవరైనా ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అదనపు రుసుములు వసూలు చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
చండ్రుగొండ తహసీల్దార్ జగదీశ్వర ప్రసాద్, అన్నపురెడ్డిపల్లి తహసీల్దార్ స్వర్ణ ఆధ్వర్యంలో ఆయా మండలాల జీపీఓలు, ఆర్‌ఐలు, మీసేవ వీఎల్‌ఈలు, సెక్షన్ అధికారులతో శనివారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మీసేవ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత వేగవంతంగా, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా మార్చేందుకే ప్రభుత్వం ఈ డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సైదేశ్వరరావు మాట్లాడుతూ.. ఆదాయ, కుల, నివాస, కుటుంబ సభ్యుల ధృవపత్రాలతోపాటు ఈబీసీ, ఓబీసీ తదితర సేవల దరఖాస్తుల పరిశీలన ఇకపై వందశాతం ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మొబైల్ అప్లికేషన్ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ యాప్ ద్వారా దరఖాస్తుల పరిశీలన చాలా సులభంగా, వేగంగా పూర్తవుతుందని వివరించారు. దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన పత్రాలను మాత్రమే అధికారులు పరిశీలించి, అర్హతను బట్టి ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయాలని, అంతేకాని వారి నుండి ఎలాంటి ఫిజికల్ కాపీలను ఆఫీసుల్లో స్వీకరించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రతి దరఖాస్తును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
మరోవైపు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తులను సిస్టమ్‌లో నమోదు చేసే సమయంలో డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు వహించాలని, ధృవపత్రాల జారీ పూర్తయిన తర్వాత వాటి రికార్డులను భద్రపరచాలని సూచించారు. “మీసేవ” సేవల్లో సాంకేతిక లేదా పరిపాలనా పరమైన సమస్యలు తలెత్తితే వెంటనే మండల స్థాయి జీపీఓ, ఆర్‌ఐ లేదా తహసీల్దార్‌ను సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు పూర్తి సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల జీపీఓలు, ఆర్‌ఐలు, మీసేవ వీఎల్‌ఈలు, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.

