కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలోని పెద్దబండ వద్ద ఉన్న ఎఫ్‌సీఐ గోదాంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు తీవ్ర కలకలం రేపాయి. గోదాంలోని స్టోర్ రూమ్, కెమికల్స్ విభాగం, రికార్డుల గదిలో మంటలు భారీగా ఎగిసిపడటంతో విలువైన పత్రాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అయితే మంటలు రికార్డ్ రూమ్ లోపల దట్టంగా వ్యాపించడంతో లోపలికి వెళ్లడం సిబ్బందికి కష్టతరంగా మారింది. లోపల వేడి కారణంగా తలుపులు, కిటికీలు భారీగా జామ్ అయ్యాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది కిటికీలు, తలుపులను బద్దలు కొట్టి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన గదికి ఆనుకుని ఉన్న కెమికల్ రూమ్ నుంచి రసాయనాలను సిబ్బంది అత్యంత అప్రమత్తంగా బయటకు తరలించారు. ప్రస్తుతం కెమికల్ రూమ్ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎఫ్‌సీఐకి సంబంధించిన కీలకమైన రికార్డులు, ఫైళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
రికార్డ్ రూమ్ తలుపులు తీస్తే తప్ప మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. లోపల ఉన్న ఫైల్స్ అన్నీ 100 శాతం అగ్నికి ఆహుతయ్యాయని తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక కారణాల వల్ల జరిగిన షార్ట్ సర్క్యూటా? లేక కీలకమైన రికార్డులను ధ్వంసం చేసేందుకు ఎవరైనా పథకం ప్రకారం నిప్పు పెట్టారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

