కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nalgonda District ) మీదుగా అత్యంత రద్దీ కలిగిన రహదారులు వెళ్లాయి. ప్రధానంగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 65)పై వాహనాల రాకపోకలు క్షణం తీరిక లేకుండా సాగుతాయి. మరోవైపు హైదరాబాద్ – వరంగల్ హైవే, నార్కట్‌పల్లి – అద్దంకి హైవే, హైదరాబాద్ – నాగార్జునసాగర్, కోదాడ- జడ్చర్ల, నకిరేకల్- మల్లంపల్లి, సూర్యాపేట-జనగామ హైవేలు ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లగా, ఈ రహదారులపై నిత్యం రోడ్డు ప్రమాదాలే. గత మూడేండ్లలో ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 5452 రోడ్డు ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా వాహనాల సంఖ్య పెరగడం.. అందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ లేకపోవడం.. మితిమీరిన వేగం.. రోడ్డు నిర్మాణంలో లోపాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒక్కో రోడ్డు ప్రమాదం వెనుక ఒక్కో కారణం ఉంది. కారణం ఏదేమైనప్పటికీ ఈ రహదారుల వెంట ట్రామాకేర్ సెంటర్లు లేకపోవడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. రోడ్డు ప్రమాదం జరగడం ఒక ఎత్తయితే.. ఆ ప్రమాదాల్లో గాయపడిన క్షత్రగాత్రులకు త్వరితగతిన చికిత్స అందించే వెసులుబాటు లేకపోవడం వల్ల ప్రాణాలు పోతున్నాయి.
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి మొదలుపెడితే.. కృష్ణాజిల్లాలోని చిల్లకల్లు వరకు 182 కిలోమీటర్ల మేర హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరించింది. కానీ ఇక్కడ ఒక్కటంటే.. ఒక్క ట్రామాకేర్ సెంటరును ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఈ రహదారిపై 2012 నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామనే ప్రభుత్వం మాటలు కేవలం ప్రతిపాదనలకే పరిమితం అవుతుండడం గమనార్హం.
మూడేండ్లలో 5452 రోడ్డు ప్రమాదాలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత మూడేండ్లలో దాదాపు 5452 రోడ్డు ప్రమాదాలు జరగగా, 2500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 5600 మంది వరకు క్షతగాత్రులుగా మిగిలిపోయారు. అయితే ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్(తొలిగంట)లోనే 90 శాతం మంది రోడ్డు ప్రమాద బాధితులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక అంచనాల ప్రకారం తెలుస్తోంది. వాస్తవానికి రోడ్డు ప్రమాదాల సమయంలో బాధితులకు సత్వర వైద్యం అందించేందుకు కీ రోల్ పోషించే ట్రామాకేర్ సెంటర్లను ప్రతి 35 కిలోమీటర్లకు ఒకటి ఏర్పాటు చేయాలి.
కానీ వందల కిలోమీటర్ల ప్రయాణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా ట్రామాకేర్ సెంటర్లు లేకపోవడం వాస్తవం. ఒక్క విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి మాత్రమే కాదు. నార్కట్‌పల్లి- అద్దంకి, వరంగల్- హైదరాబాద్, హైదరాబాద్-నాగార్జునసాగర్, సూర్యాపేట-జనగామ, కోదాడ-జడ్చర్ల హైవేలపై ఎక్కడా ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేయడంలో పాలకులు.. ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పాలి. ప్రతి ఎన్నికల సమయంలోనూ ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటు హామీలకే పరిమితం అవుతున్నాయి.
ఇవీ డెంజర్ జోన్లు..
జాతీయ రహదారి 65పై అధికారులే స్వయంగా బ్లాక్ స్పాట్‌లను గుర్తించారు. దాదాపు 200 కిలోమీటర్ల జర్నీలో లెక్కకు మించి బ్లాక్ స్పాట్‌లు ఉన్నాయి. దండుమల్కాపురం నుంచి మొదలుకుంటే.. కృష్ణాజిల్లా వరకు కోకొల్లలు. ప్రధానంగా కొర్లపహాడ్, నవాబ్ పేట, పెద్దకాపర్తి యూ జంక్షన్ , మేళ్లచెర్వు ప్లై ఓవర్ , ముకుందాపురం యూ టర్న్, ఆకుపాముల బైపాస్, కట్టంగూర్ – నల్లగొండ క్రాస్ రోడ్డు, కట్టంగూర్ లోకల్ , నల్లబండగూడెం వద్ద రామాపురం క్రాస్ రెడ్డు, సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్, కోదాడ కట్టకొమ్మగూడెం క్రాస్ రోడ్డు, శ్రీరంగాపురం, దురాజ్ పల్లి క్రాస్ రోడ్డు, కొమరబండ క్రాస్ రోడ్డు వంటి చోట్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. మరోవైపు వరంగల్, నాగార్జునసాగర్, అద్దంకి హైవేపైనా ఇదే పరిస్థితి.
యాక్సిడెంట్ అయితే పట్నానికే..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా.. మెరుగైన అత్యవసర వైద్యం కావాలంటే.. హైదరాబాద్ బాట పట్టాల్సిందే. ఇటు సూర్యాపేట ప్రభుత్వాస్పత్రి.. అటు నల్లగొండ ప్రభుత్వాస్పత్రి.. ఓవైపు కామినేని హాస్పిటల్.. మరోవైపు భువనగిరి ప్రభుత్వాస్పత్రుల్లో అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఈ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు వైద్యం అందించడం మినహా ప్రాణాపాయ స్థితి ఉంటే మాత్రం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యాపేట, నకిరేకల్, నల్లగొండ, నార్కట్‌పల్లి, భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగిన వారిని తరలించేందుకు 2 గంటల నుంచి 4 గంటల వరకు సమయం పడుతుంది.
అదే అర్వపల్లి, తిరుమలగిరి, కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, హాలియా, నాగార్జునసాగర్ తదితర ప్రాంతాల నుంచైతే 5 గంటలకు పైగానే సమయం పడుతుంది. నిజానికి రోడ్డు ప్రమాదాల్లో మొదటి గంట సమయమే కీలకం. అలాంటి సమయమంతా ఆస్పత్రికి చేర్చే జర్నీకే సరిపోతుంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికైనా పాలకులు ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది.


