కలం, నల్లగొండ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ఇసుక వేస్తే రాలనంత జనసందోహం తరలివచ్చిందని, సభ సక్సెస్‌ను జీర్ణించుకోలేకే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని నల్లగొండ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (Nalgonda DCC Chief) పున్నా కైలాష్ నేత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు రాష్ట్రంలో, ఇటు నల్లగొండ జిల్లాలో ఎన్నడూ లేనంతగా ప్రగతి పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. “కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న ప్రగతిపై ధైర్యం ఉంటే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌కు రావాలి. అక్కడ మేం బహిరంగ చర్చకు సిద్ధం” అని కైలాష్ నేత సవాల్ విసిరారు.
“ఆదివారం నాటి సీఎం సభ దేవుడి పెళ్లిలాంటిది. దేవుడి పెళ్లికి పిలిచినా, పిలవకపోయినా వెళ్లడం మా బాధ్యత. శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కల్యాణానికి నన్ను నేను ఒక పూజారిలా భావిస్తాను తప్ప, ఇందులో నాకు ఎలాంటి అవమానం అనే భావనే లేదు. తాను కాంగ్రెస్ పార్టీకి కట్టుబడిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానాల కోసం ఎదురుచూడడం తమ సంస్కృతి కాదు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన నాయకత్వంలోనే ఐక్యంగా ముందుకు సాగుతుంది‘‘ అని పున్నా కైలాష్ నేత (Nalgonda DCC Chief) స్పష్టం చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఇతర స్థానాల టికెట్లు పార్టీ అధిష్ఠానం నిర్ణయాల మేరకు, జిల్లా అధ్యక్షుడిగా తన సారథ్యంలోనే ఖరారవుతాయని కేడర్‌కు భరోసా ఇచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలపైనా ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 12కి 12 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, ఆ గెలుపును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజయ కానుకగా అందిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలిచే పార్టీ కొనియాడారు.

