కలం, వెబ్ డెస్క్: వరంగల్ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏం చేశాయనే దానిపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై అమరవీరుల స్థూపం దగ్గరకు రావాలన్నారు. “ఎవరు ఎంత అభివృద్ధి చేశారో లెక్కలు తేలుద్దాం, మీకు దమ్ముంటే చర్చకు రండి!” అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో సోమవారం బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, తదితరులు హాజరయ్యారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాం..
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర, దక్షిణ భారత్ అనుసంధాన నగరంగా వరంగల్ ఉంటుందని కొనియాడారు. వరంగల్ నగరానికి కేంద్ర ప్రభుత్వం రూ.17 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదిక తన దగ్గర ఉందన్నారు. వరంగల్ కు రాదనుకున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం ఏర్పాటు చేసిందని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది వరంగల్ ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించనున్నామని తెలిపారు. వరంగల్ కు రాబోయే మొదటి విమానంలో తాను కూడా ప్రయాణిస్తానని అన్నారు.
సమాధానం చెప్పాలి..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయ సిబ్బంది కూడా కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సర్ ప్రక్రియ నిర్వహిస్తుంటే సీఎం రేవంత్, మజ్లిస్ పార్టీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఏదైనా హామీ ఇస్తే.. కచ్చితంగా అమలు చేస్తారనే గ్యారంటీ ప్రజల్లో ఉందని అన్నారు. కాంగ్రెస్‌లాగా ఆరు గ్యారంటీలు ఇచ్చి మోసం చేసేవాళ్ళం కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలువబోతుందని.. దీనికి వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు నాంది కాబోతున్నాయని వ్యాఖ్యానించారు.

