కలం, హనుమకొండ : అయోధ్య రామాలయంలో రూ.200 కోట్ల అవినీతిపై పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు (CPI Leader Takkallapalli Srinivasa Rao) ఆరోపించారు. హనుమకొండ బాలసముద్రంలో సోమవారం నిర్వహించిన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి విరాళాలుగా సేకరించిన రూ.1400 కోట్ల లెక్కలు గా చూపించారని.. కానీ, ప్రస్తుతం వాటి విలువ రూ.1,67,000 కోట్లకు పైగా ఉంటుందన్నారు.
విరాళాలకు సరైన రశీదులు లేదా లెక్కలు లేవని విమర్శించారు. బీజేపీ నాయకులు అయోధ్య రామాలయం నిధుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది సామాన్య భక్తులు తమ కష్టార్జితాన్ని దేవుడిపై భక్తితో విరాళాలుగా ఇస్తే, ఆలయ పర్యవేక్షణ లోపాల వల్ల కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టడం, ఇంటి దొంగలే వాటితో విలాసవంతమైన జీవితాలు గడపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అగ్రహం వ్యక్తం చేశారు.
రామమందిర నిర్మాణం, విరాళాల సేకరణ ప్రారంభం నుండి నిధుల నిర్వహణలో పూర్తి స్థాయి పారదర్శకత లేదని, లెక్కింపు, ఆడిటింగ్‌లో ఆలయ ట్రస్ట్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కేవలం కొద్దిమంది తాత్కాలిక ఉద్యోగులను మాత్రమే నిందితులుగా చూపించి చేతులు దులుపుకోకుడదన్నారు. విరాళాల గోల్‌మాల్ వెనుక ఉన్న పెద్దలు, ఆలయ ట్రస్ట్‌కు చెందిన కీలక వ్యక్తుల పాత్రపై కూడా అత్యున్నత స్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలని శ్రీనివాసరరావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

