కలం, నల్లగొండ బ్యూరో : ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణను (Land Acquisition) వేగవంతం చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ (Collector Chandrasekhar) అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఛాంబర్‌లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయ సముద్రం, మాధ ఎడవల్లి, శివన్నగూడెం, అంబ భవాని, డిండి, నక్కలగండి, ఏకేబియర్, పెండ్లిపాకల చింతచెట్టు తండా తదితర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్‌లోని అన్ని సాగునీటి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టుల వారీగా పురోగతిని సమీక్షిస్తూ.. భూసేకరణ, పునరావాసం (ఆర్ అండ్ ఆర్), పరిహారం చెల్లింపుల అంశాల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో భూసేకరణ (Land Acquisition) ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించి, రైతులకు సమయానికి పరిహారం చెల్లించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులు పూర్తయితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని, పునరావాసం పొందిన కుటుంబాలకు అవసరమైన అన్ని సదుపాయాలు అందించాలని సూచించారు. విభాగాల మధ్య సమన్వయం చేసుకుని పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రతివారం పురోగతి నివేదికను సమర్పించాలని, నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తిచేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Also: మెట్రో రైలును సంగారెడ్డి వరకు విస్తరించాలి : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
Follow Us On : WhatsApp

