కలం, నల్లగొండ బ్యూరో: ‘ నియోజకవర్గంలో గంజాయి ఇష్యూ ఉంది. ఇప్పటికే కట్టడి చేశాం. యువత తప్పుదారిలో వెళ్లొద్దు’ అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Nakrekal MLA Vemula) అన్నారు. మంగళవారం నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని నారాయణరెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గస్థాయి ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ (99 Day Action Plan) కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలకు ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభించనున్నామని వెల్లడించారు. ప్రజలకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.
99 రోజుల కార్యక్రమంలో దశలవారీగా ప్రజా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ బి .చంద్రశేఖర్ మాట్లాడారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మొదటి 15 రోజులు పారిశుద్ధ నిర్వహణ చేపట్టామన్నారు. సమస్యలు లేని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

