కలం, ఖమ్మం బ్యూరో: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాలేజీల ఫీజు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనా వైఫల్యాలను ఎండగడుతూ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన బీఆర్ఎస్ భారీ వంటావార్పు నిరసన చేపట్టింది. 4 వేలకు మందికి పైగా మహిళలు, పార్టీ శ్రేణులు తరలిరావడంతో కొత్తగూడెం పరిసరాలు గులాబీమయంగా మారాయి.
అధికారంలోకి వచ్చాక గాలికొదిలేశారు..
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్ల కోసం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఇచ్చారని మండిపడ్డారు. అధికారం చేపట్టాక మహిళలకు రూ.2,500 జీవనభృతి, పింఛన్ల పెంపు, ఉచిత స్కూటీలు, కేసీఆర్ కిట్ వంటి పథకాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఫీజు బకాయిలు విడుదల చేయక విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు.
ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా నిలిచిపోయాయని ఆవేదన ఎంపీ రవిచంద్ర వ్యక్తం చేశారు. ఇటీవలే దారుణ హత్యకు గురైన శిరీష కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిషేధిత 22A జాబితాలోని భూములకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి ఎంపీ రవిచంద్ర రోడ్డుపైనే భోజనం చేశారు.

