కలం, అశ్వారావు పేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయింది. ఆరు గ్యారెంటీల అమలును ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనల్లో భాగంగా అశ్వారావుపేటలో బీఆర్ఎస్ (Aswaraopeta BRS) పార్టీ నిరసనలు చేపట్టింది. ఆద్యంతం ఇది ప్రజా పోరాటమా..? వినోదం కోసం చేసిన ఈవెంటా..? అనే ప్రశ్నలు తలెత్తాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జి మెచ్చా నాగేశ్వరరావు, సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జి ఉప్పల వెంకటరమణ నేతృత్వంలో జరిగిన ఆందోళనలు పూర్తి భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదునైన నినాదాలు మారుమోగాల్సిన చోట డీజే పాటలు, నాయకులు, కార్యకర్తల డ్యాన్సులతో హంగామా చేశారు. ప్రజల ఆవేదన, ఆగ్రహానికి ప్రతీకగా సాగాల్సిన నిరసనల్లో బాణసంచా కాలుస్తూ వేడుకల మాదిరి తలపించడాన్ని చూసి స్థానికులు సైతం నివ్వెరపోయారు.
గాంభీర్యం ఎక్కడ..?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రైతుల కష్టాలు, యువత ఉద్యోగాల ఎదురుచూపులు, సంక్షేమ పథకాల అమల్లో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండగట్టాలని సూచించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల ఆవేదనను ప్రతిబింబించాల్సిన చోట, ఇలాంటి ఆర్భాటాలకు దిగడం స్థానిక ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నించాలంటే ఆందోళన కార్యక్రమాల్లో గాంభీర్యం ఉండాలి. డీజేలు పెట్టి డ్యాన్సులు చేయడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తమ సమస్యలపై పోరాడే విధానం ఇదేనా..? అని చర్చించుకుంటున్నారు.
నిరసన అంటే వినోదమా..?
ప్రజాస్వామ్యంలో పార్టీలు చేపట్టే నిరసనలకు విశిష్టమైన స్థానం ఉంటుంది. అయితే, అవి ఫక్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా సాగాలే తప్ప, వినోదాన్ని పంచే వేదికలుగా మారకూడదని అశ్వారావుపేటలో బీఆర్ఎస్ పార్టీ చేసిన హంగామా చూసి పలువురు చెబుతున్నారు. ఏయే పథకాలు ఎంతమందికి అందలేదు, రుణమాఫీ పరిస్థితి ఏమిటనే అంశాలపై గణాంకాలతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే పోరాటానికి అర్థం ఉంటుందన్నారు. ఇకనైనా బాణసంచా, డీజేలు, ఈవెంట్ మాదిరి కాకుండా, ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా క్షేత్రస్థాయి పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అశ్వారావుపేట ఘటన మొత్తం పార్టీ శ్రేణులకు బలమైన హెచ్చరిక లాంటిదని కూడా సూచిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్భాటాలు, ఆడంబరాలను పక్కనపెట్టి పార్టీ నాయకత్వం ఉద్దేశానికి అనుగుణంగా ప్రజా సమస్యలపై సీరియస్‌గా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిరసన అంటే వినోదం కాదని, ప్రజల హక్కుల కోసం చేసే పోరాటం అని గుర్తుంచుకున్నప్పుడే ప్రతిపక్షం పట్ల ప్రజల్లో నమ్మకం బలపడుతుందని కుండబద్దలు కొడుతున్నారు.

