కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తోందని నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. తిమ్మాజీపేట మండలం బావాజీపల్లిలో చెరువు పూడికతీత, ఒండ్రు మట్టి తరలింపు పనులను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. పనుల పురోగతి, కూలీల హాజరు, మట్టి తరలింపు విధానం, రైతులకు అందుతున్న ప్రయోజనాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒండ్రు మట్టిని రైతుల పొలాలకు తరలించుకుంటే భూమి సారవంతం పెరిగి పంటల దిగుబడులు మెరుగుపడతాయని చెప్పారు. అలాగే పనులకు హాజరవుతున్న కూలీలకు ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కూలీలతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పని పరిస్థితులు, వేతనాల చెల్లింపులు, అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పనులు పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

