Mobile Popup Ad
Mobile Popup Ad

టీచ‌ర్ల‌ అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలి: టీజీ యూటీఎఫ్

కలం, నల్లగొండ: వ్యక్తిగత ప్రయోజనాల కోసం విద్యా శాఖలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TS UTF) నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం నల్లగొండ (Nalgonda)లోని జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షుడు బక్క శ్రీనివాసా చారి అధ్యక్షతన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘బడిబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం తమ ఫెడరేషన్ చిత్తశుద్ధితో పని చేస్తోందని తెలిపారు. బడి ఈడు పిల్లలు ఉన్న ఆవాస ప్రాంతాలలో ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉందన్నారు.

నల్లగొండ జిల్లాలో కొంతమంది ఉపాధ్యాయులు తాము వేతనం తీసుకుంటున్న పాఠశాలల్లో కాకుండా తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాలకు వెళ్లేందుకు అప్పుడే పైరవీలు ప్రారంభించారని నేతలు మండిపడ్డారు. విద్యార్థుల అవసరాల కోసం కాకుండా, ఉపాధ్యాయుల వ్యక్తిగత సదుపాయాల కోసం విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అక్రమంగా డిప్యూటేషన్లు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. జిల్లాలో ఇష్టారాజ్యంగా సాగుతున్న అక్రమ డిప్యూటేషన్ల పర్వం జిల్లా విద్యాశాఖను అభాసుపాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా, విద్యార్థుల ప్రయోజనాలే పరమావధిగా ఉపాధ్యాయుల పని సర్దుబాటు శాస్త్రీయంగా, పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. మిగులుగా ఉన్న ఉపాధ్యాయులందరినీ, ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు మాత్రమే నిబంధనల ప్రకారం సర్దుబాటు చేయాలన్నారు.

అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేసి, వారు వేతనం తీసుకునే పాఠశాలల్లోనే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలా కాకుండా కేవలం ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసమే డిప్యూటేషన్లు ఇస్తే.. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశం అనంతరం టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ బృందం నల్లగొండ జిల్లా విద్యాశాఖాధికారి సుసిందర్ రావును కలిసి సమస్యపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి. నాగమణి, ఎఫ్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు బి. అరుణ, నర్రా శేఖర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జి. అరుణ, జిల్లా కార్యదర్శులు, జిల్లా కమిటీ కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>