మెదక్‌లో ఎమ్మెల్యే vs కలెక్టర్

కలం, మెదక్ బ్యూరో: మెద‌క్ (Medak) జిల్లాలో ధాన్యం కోనుగోలు అంశంపై ఎమ్మెల్యే వ‌ర్సెస్‌ క‌లెక్ట‌ర్ అన్న‌ట్టుగా మారింది. నేరుగా క‌లెక్ట‌ర్‌ను టార్గెట్ చేస్తూ స్దానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయ‌కులు బహిరంగంగా విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌రిస్ధితి తీవ్ర‌తను అద్దం ప‌డుతుంది. ప్రసుత్తం మెద‌క్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు క‌లెక్ట‌ర్, అధికారుల నిర్లక్ష్య వైఖరే కార‌ణ‌మ‌ని అధికార కాంగ్రెస్ పార్టీ చెందిన మెద‌క్ నియోజ‌క‌వ‌ర్గ‌ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు (Mynampally Rohith Rao) మాట్ల‌డ‌టం చ‌ర్చనీయంగా మారింది.

కలెక్టర్ టార్గెట్‌గా ఎమ్మెల్యే విమర్శలు

శనివారం మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ధాన్యం కొనుగోళ్ల సమీక్ష సమావేశంలో హాట్ హాట్ గా సాగింది.ఈ స‌మీక్ష స‌మావేశానికి జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌తీమా సింగ్ (Collector Pratima Singh) వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో సెలవులో ఉండ‌టం వ‌ల‌న హాజ‌రు కాలేదు. మెద‌క్ ఎమ్మెల్యే రోహిత్, అడిన‌ష‌ల్ క‌లెక్ట‌ర్ న‌గేష్‌తో స‌హా వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు, స్ధానిక ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మీక్ష సందర్బంగా స్థానిక‌ ప్ర‌జాప్ర‌తినిధుల స‌మ‌క్షంలోనే ఎమ్మెల్యే రోహిత్ ధాన్యం కొనుగోళ్లలో జాప్యం విష‌యంలో క‌లెక్ట‌ర్, అధికారులను ల‌క్ష్యంగా చేసుకొని నేరుగా విమ‌ర్శించారు. ఎమ్మెల్యే రోహిత్ మాట్ల‌డుతూ “రైతులు రోడ్ల మీదకు వస్తుంటే అధికారులు మాత్రం ఏసీ గదుల్లో కూర్చొని సమీక్షలు చేస్తారా?” “కలెక్టర్ ఫోన్ ఎత్తడం లేదు. ప్రజల సమస్యలు వినడానికి కూడా సమయం లేకుంటే ఆ పదవిలో ఎందుకు ఉండాలి?” అంటూ తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“కలెక్టర్ సెలవులో ఉంటే ఇంచార్జ్‌ కలెక్టర్‌ను ఎందుకు నియమించలేదు? ప్రజల సమస్యలు చూసే వ్యవస్థ లేకుండా జిల్లా ఎలా నడుస్తుంది?” అని ప్రశ్నించారు. ముఖ్యంగా మెద‌క్ క‌లెక్ట‌ర్ ప్ర‌తీమా సింగ్ ను ల‌క్ష్యంగా ప‌లు ఆరోప‌ణ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయంగా మారింది. త‌మ ప్రభుత్వం రైతు పక్షపాతి అని స్పష్టం చేసిన ఎమ్మెల్యే “మా సీఎం రైతుల కోసం 24 గంటలు పని చేస్తున్నారు. మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. అయినా గ్రౌండ్ లెవెల్‌లో సమస్యలు ఎందుకు తగ్గడం లేదు?” అంటూ ప్రశ్నించారు. “మంత్రి సూచ‌న‌లు ఎందుకు అమలు కావడం లేదు? ప్రభుత్వం చెప్పేది ఒకటి.. ఫీల్డ్‌లో జరుగుతున్నది ఇంకొకటి” అని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికైనా అధికారులు ఏసీ గదుల్లో కూర్చొని నివేదికలు చెప్పడం కాకుండా గ్రామాలకు వెళ్లి రైతుల పరిస్థితి తెలుసుకోవాలని “ఫీల్డ్ మీద ఉండండి… రైతులతో మాట్లాడండి… సమస్యలు అక్కడే పరిష్కరించండి. రైతు రోడ్డెక్కే పరిస్థితి రావద్దని” ఎమ్మెల్యే రోహిత్ సూచించారు.

క‌లెక్ట‌ర్‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల నిర‌స‌న‌

సహ‌జంగా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేలా ప్ర‌తిప‌క్ష‌పార్టీలు ధ‌ర్నాలు, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేస్తారు. మెద‌క్‌లో మాత్రం ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీ రైతుల ఇబ్బందులపై ఎలాంటి పోరాటం చేయ‌కుండా మౌనంగా ఉన్నారు. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయ‌కులే రైతుల‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్ ముందు ధ‌ర్నా చేశారు. శుక్ర‌వారం రోజున క‌లెక్ట‌ర్ సెలవుపై ఉన్న స‌మ‌యంలో ఆమెకు వ్య‌తిరేకంగా సొంత ప్రభుత్వంలోనే ధ‌ర్నా నిర్వ‌హించారు కాంగ్రెస్ నాయ‌కులు. కోత‌లు ప్రారంభమై రెండు నెల‌లు అవుతున్నా ధాన్యం కోనుగోళ్లు ఆల‌స్యంగా జ‌రుగుతున్నాయ‌ని, క‌ల్లాల మీద‌నే ఇంకా వడ్లు ఉన్నాయ‌ని , కొనుగోళ్లు నిర్ల‌క్ష్యం చేస్తున్న క‌లెక్ట‌ర్‌ను స‌స్పెండ్ చేయాల‌ని, రైతు వ్య‌తిరేకి క‌లెక్ట‌ర్ అంటూ, ఆమెకు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ నిర‌స‌న తెలిపారు. క‌లెక్ట‌ర్ రైతు వ్యతిరేకి అని ధ‌ర్నా చేయ‌డం, మ‌రుస‌టి రోజే స‌మీక్ష స‌మావేశంలో ఎమ్మెల్యే క‌లెక్ట‌ర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడ‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తుంద‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు అంశం అనేది బ‌యట చెబుతున్నప్ప‌టికి, ప‌లు విష‌యాల్లో ఎమ్మెల్యే- క‌లెక్ట‌ర్ మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేకపోవ‌డమే అస‌లు కార‌ణ‌మ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు త‌న మాట విన‌డం లేద‌నే కార‌ణంతోనే ఎమ్మెల్యే రోహిత్, కలెక్ట‌ర్ పై కావాల‌నే త‌న అనుచ‌రులతో ధ‌ర్నా చేయించ‌డని, ఆయ‌న‌ ప్ర‌త్య‌ర్థులు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోహిత్ కు కలెక్ట‌ర్ ప్ర‌తీమా సింగ్‌కు పొస‌గ‌డం లేద‌ని.. అందుకే నేరుగా ఆమెను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే విమ‌ర్శ‌లు చేశాడ‌ని చెబుతున్నారు.

ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నార‌నే సాకుతో క‌లెక్ట‌ర్, అధికారుల‌పై బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని, స‌మ‌స్య‌లు ఉంటే స‌రైన స‌ల‌హాలు, సూచ‌న‌లు చేయాలి త‌ప్ప నేరుగా ఆఫీస‌ర్ల‌ను టార్గెట్ చేయ‌డం మంచి సంప్ర‌దాయం కాద‌ని అధికారులు అనుకుంటున్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు స‌మిష్టిగా, స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలి గానీ ప‌ర్స‌న‌ల్ అజెండాతో, క‌క్ష‌పూరితంగా ప‌ని చేయ‌డం స‌రికాద‌ని అధికార వ‌ర్గాలు అనుకుంటున్నాయి. ధాన్యం కోనుగోళ్ల కేంద్రంగా మెద‌క్ ఎమ్మెల్యే , క‌లెక్ట‌ర్ మ‌ధ్య న‌డుస్తున్న గొడ‌వ ఏటు వెళ్తుందో కాల‌మే నిర్ణ‌యించ‌నుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>