కలం, మెదక్ బ్యూరో: ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాలు అత్యంత ప్రమాదకరంగా మారాయని, సమాజం నుండి వాటిని తరిమి కొట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, విద్యార్థి దశ నుండి పిల్లలకు డ్రగ్స్ దుష్పరిమాణాలను వివరించాలని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (MLA Gudem Mahipal Reddy) విజ్ఞప్తి చేశారు. పటాన్ చెరువులో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానసిక ప్రశాంతత, శారీరక పటుత్వం కోసం విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. నియోజకవర్గంలో క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామన్నారు. గత 10 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో కరాటే పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు, క్రీడల పైన ఆసక్తి పెంచుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. వివిధ రాష్ట్రాల నుండి సుమారు 2000 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్ కు హాజరయ్యారు.

