కలం, వెబ్ డెస్క్ : బీహార్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముజఫరాపూర్ (Muzaffarpur)లోని ప్రసాద్ ఆస్పత్రిలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని ఐదవ అంతస్తులో ఉన్న ఐసీయూ (ICU) విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో పాటు దట్టమైన పొగ భవనాన్ని కమ్మేసింది. దీంతో ఆస్పత్రిలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రాణాలు కాపాడుకునేందుకు రోగులు, వారి బంధువులు, సిబ్బంది పరుగులు తీశారు.
ఈ ప్రమాదంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న 10 మంది రోగులు ఊపిరాడక అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద స్థలం నుంచి 20 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. ఐసీయూలోని ఆక్సిజన్ యూనిట్, మానిటర్ సిస్టంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

