కలం, వెబ్ డెస్క్: నేడు కేరళలోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు కేరళను తాకిన వారం రోజులకు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణుల వల్ల రాష్ట్రంలో మూడు రోజులపాటు ఈదురుగాలులు, ఉరుములతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షా సూచనలున్నాయని వివరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. బుధవారం సూర్యాపేటలో అత్యధికంగా 44.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 40 నుంచి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొన్నిచోట్ల కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం సాయంత్రం నల్లగొండ, సూర్యాపేట, యా దాద్రి-భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, హనుమకొండ, కామారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.

