కలం, నల్లగొండ బ్యూరో: రాబోయే రోజుల్లో తప్పకుండా పదవి వస్తుందని ఆశిస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం చౌటుప్పల్ పరిధిలోనే లక్కారంలోని ఎస్ఎంఆర్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన నూతన మున్సిపాలిటీ పాలకవర్గ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీలో నిజాయితీగా ఎవరు కష్టపడుతున్నారో అధిష్ఠానానికి తెలుసని, ప్రజల్లో ఉండి నిజాయితీగా పనిచేసేవారు ఎమ్మెల్యేలుగా చేయాలనేది తన ఆలోచన విధానమన్నారు. తెలంగాణ రాజకీయాలలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత తనలాంటివారిపై ఉందని, పోరాటమైనా.. త్యాగమైనా ప్రజల కోసమేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాలు పదవులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించే విధానం తనది కాదన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ (Choutuppal Municipality) గెలుపులో సమన్వయంతో పనిచేసిన ప్రతి ఒక నాయకునికి, కార్యకర్తకి కృతజ్ఞతలు తెలిపారు. చౌటుప్పల్ ప్రాంతంలో భూమి కాలుష్యం, నీటి కాలుష్యం, వాయ కాలుష్యం ఎక్కువవుతోందని చెప్పారు. చౌటుప్పల్ పట్టణంలో అధికారిక లెక్కల కంటే ఎక్కువగా లక్ష జనాభా ఉందని, ఈ జనాభాకి సరిపడా మౌలిక వసతుల కల్పన జరగాలన్నారు.
ఔటర్ సమీపంలో ఉండడమే కాకుండా రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు రీజనల్ రింగ్ రైలు కూడా వస్తుందన్నానరు. రాబోయే కాలంలో చౌటుప్పల్ కీలక ప్రాంతంగా మారనుందని ఆయన చెప్పుకొచ్చారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక దూర దృష్టితో తీసుకున్న నిర్ణయమని, కులాలతో రాజకీయం చేసేవారు కొంతకాలమే ఉంటారని, కానీ మానవత్వంతో పని చేసే వారే ప్రజల్లో చెరగని ముద్ర వేస్తారని గుర్తుచేశారు. రాజగోపాల్ రెడ్డి అంటేనే అందరి మనిషి అని, అధికారాన్ని పదవిని ఒక బాధ్యతగా స్వీకరించాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) పేర్కొన్నారు.
Read Also: వెలుగుమట్ల బాధితులందరికీ నిజ నిర్ధారణ కమిటీతోనే న్యాయం: కవిత
Follow Us On: Facebook

