కలం, వెబ్ డెస్క్: ‘వెలుగుమట్ల (Velugumatla) బాధితులందరికీ నిజ నిర్ధారణ కమిటీతో (Fact Finding Committee)నే న్యాయం జరుగుతుంది. కమిటీలో రిటైర్డ్ జడ్జి, ఆర్మీ మాజీ మేయర్, ప్రొఫెసర్లు, లాయర్లు, సామాజిక వేత్తలు, జర్నలిస్టులు ఉన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ కమిటీ ప్రభుత్వం వెంటబడుతుంది’’ అని జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వెలుగుమట్లలో నోటీసులు, హెచ్చరిక లేకుండా పేదల వాళ్ల 750 ఇళ్లను కూల్చేసిందని మండిపడ్డారు. ధర్మసమాజ్ పార్టీ, తెలంగాణ జాగృతి వెలుగుమెట్ల బాధితుల కోసం పోరాడినందువల్లే ప్రభుత్వం దిగివచ్చిందని కవిత గుర్తుచేశారు.
‘‘కూల్చిన చోటే 350 మందికి పట్టాలు ఇస్తామని.. మరో 110 మందికి వాళ్ల గ్రామాల్లో ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం స్పందించిన తీరును బట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాపోరాటాలకు గెలుపు ఉంటుందని భావిస్తున్నాం. అయితే 750 మంది ఇళ్లను కూల్చేసి, 460 మందికి మాత్రమే ఇళ్లను ఇస్తామంటున్నారు. ఇంకా చాలా మందికి న్యాయం జరగలేదన్నది స్పష్టంగా తెలుస్తోంది’’ అని కవిత ప్రశ్నించారు.
‘‘బాధితులందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో విశారదన్ నిన్న కూడా ఖమ్మం వెళ్తే ఆయనను అరెస్ట్ చేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏమాత్రం పారదర్శకత లేకుండా ఉంది. ప్రభుత్వం బాధ్యతయుతంగా మెలిగేలా ఎలా చేయాలన్న దానిపై మేము చర్చించాం. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్‌తోపాటు సమాజం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న చాలా మందితో మాట్లాడం. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, ఆర్మీ మాజీ మేజర్ మదన్ మొహన్, ప్రొఫెసర్లు అనురాధ, నాగం కుమార స్వామి, రామయ్యతోపాటు లాయర్లు సుంకర నరేష్, శ్రావణ్ గౌడ్, నూర్జన్, జర్నలిస్టులు తెలంగాణ విఠల్, ఆకాశ్ గౌడ్, క్రాంతిలాంటి వాళ్లు ఒక కమిటీగా ఏర్పడ్డారు’’ అని కవిత అన్నారు.
‘‘పేదవాళ్లకు న్యాయం చేసేందుకు వాళ్లు ఉద్యోగాలు చేస్తూనే సమాజం కోసం పోరాటం చేసేందుకు ముందుకువచ్చారు. వాళ్లందరి కమిట్‌మెంట్‌ను ప్రశంసిస్తున్నా. ప్రభుత్వం, అధికారులు ఈ కమిటీకి సహకరించాలి. జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ప్రజాపోరాటాలకు ప్రభుత్వం దిగివచ్చింది. కానీ సంపూర్ణ న్యాయం జరగలేదు. డిసెంబర్ 9 నాటికి వాళ్ల ఇళ్లను పూర్తి చేస్తామని చెబుతున్నారు. కానీ అప్పటి వరకు ఆ పేదలు ఎక్కడ ఉండాలి? వాళ్ల ఇంటి అద్దె, పిల్లల చదువుకు కావాల్సిన సాయం ప్రభుత్వమే చేయాలి. ఇప్పుడు ఏర్పడిన కమిటీ ద్వారా బాధితులకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాలుగా పోరాటం చేస్తాం. అదే విధంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న మేధావులు కూడా వెలుగుమట్ల విషయంలో స్పందించాలి’’ అని కవిత (Kavitha) అన్నారు.
‘‘ప్రొఫెసర్ కోదండ రాం, హరగోపాల్, ఆకునూరి మురళి లాంటి వాళ్లు స్పందించాలని కోరుతున్నా. వెలుగుమట్లలో ఎంత కర్కషంగా, దారుణంగా, అన్యాయంగా బాధితుల ఇళ్లు కూల్చారో వెళ్లి తెలుసుకోండి. పేదలకు మేలు చేసేందుకు ఇదే సరైన సందర్భం అని మీకు సూచిస్తున్నా. మేధావుల మౌనం సమాజానికి ఎంతో నష్టం చేస్తుంది. ఈ కమిటీ ఒక న్యూట్రల్ కమిటీ. కచ్చితంగా ప్రభుత్వం సహకరించాలి’’ అని జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.
Read Also: కేసీఆర్ అనుభవం అసెంబ్లీకి అవసరం: శ్రీధర్‌బాబు
Follow Us On: Instagram

