కలం, వరంగల్ బ్యూరో : సమ్మక్క-సారలమ్మ చరిత్ర మరో వెయ్యేళ్లు గుర్తుండేలా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి, తమ వంతు సహకారం అందజేసిన మంత్రివర్గ సహచరులందరికీ ఒక ఆదివాసీ బిడ్డగా పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. ఆదివారం రాత్రి మేడారం(Medaram)లో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. 100 కిలో మీటర్ల మేర గోదావరి నది ములుగు నియోజకవర్గంలో పారుతున్నా తమకు ఇప్పటి వరకు చుక్క నీరు కూడా రాలేదన్నారు. కేబినేట్‌లో ములుగుకు గోదావరి జలాలు తరలించేందుకు రూ.143 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును మంజూరు చేసిన మంత్రులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
తన జీవితంలో రెండే రెండు కలలుండేవని, ఒకటి మేడారం ఆలయ అభివృద్ధి, రెండు ములుగు నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకురావడం అని సీతక్క తెలిపారు. గతంలో గోదావరి జలాల కోసం ఎన్నో పాదయాత్రలు జరిగాయని, కానీ నేడు ఎలాంటి యాత్రలు చేపట్టకుండానే తమ బాధను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి నియోజకవర్గానికి రూ.143 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మంజూరు చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవలను యావత్ ఆదివాసీ సమాజం, ములుగు నియోజకవర్గం గుర్తుంచుకుంటుందని చెప్పారు.
తమ కుల ఇలవేల్పు కోసం గత పాలకులు ఓ గుడిని నిర్మించారని, కానీ సీఎం రేవంత్ రెడ్డికి సమ్మక్క సారలమ్మతో కుల బంధం, కుటుంబ బంధం లేదని, సకల జనులకు ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మలతో ముఖ్యమంత్రికి భక్తి, బాధ్యత ఉందన్నారు. సమ్మక్క సారలమ్మ గుడితో ముఖ్యమంత్రికి భావోద్వేగ బంధం ఉందన్నారు. అందుకే కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలో గుడి నిర్మాణాన్ని పూర్తి చేశారన్నారు. ఆదివాసీల గుండెల్లో ఎప్పటికీ రేవంత్ రెడ్డి నిలిచిపోతారన్నారు. రాజధాని వెలుపల మేడారం అడవిలో, ఆదివాసీ ప్రాంతంలో ఈరోజు కేబినేట్ నిర్వహించుకోవడం ఒక చరిత్రగా ఆమె పేర్కొన్నారు. ఈ కేబినేట్ సమావేశానికి వచ్చి ములుగు అభివృద్ధి కోసం మంచి నిర్ణయాలు తీసుకున్న కేబినేట్ సహచారులకు, ఉన్నతాధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ములుగు మీద ప్రేమతో ఇక్కడికి వచ్చేసిన ప్రభుత్వ సలహాదారులు ఎంపీలు, ఎమ్మెల్యే లు, ప్రముఖుల అందరికీ ములుగు ప్రజల తరఫున మరొక్కసారి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలియజేశారు.


