కలం, తెలంగాణ బ్యూరో: మేడారంలోని జంపన్నవాగు (Jampanna Vagu) లో నిరంతరం నీళ్లు పారేలా శాశ్వత ఏర్పాట్లు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. ఆదివారం మేడారంలోని హరిత హోటల్ లో కేబినెట్ మీటింగ్ అనంతరం రాత్రి సభలో ఆయన మాట్లాడారు. లక్నవరం చెరువు నుంచి పైపులైన్ వేసి నీళ్లు అందజేస్తామని వెల్లడించారు. సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో తమ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు. మేడారాన్ని (Medaram) అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రపంచం నలుమూలల నుంచి మేడారానికి భక్తులు వచ్చేలా అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలు కట్టాలని నిర్ణయించి, ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేశామని ఆయన తెలిపారు.
ఇద్దరు ఆడబిడ్డలు, మంత్రులు సీతక్క (Seethakka), సురేఖ (Konda Surekha) కలిసి సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లను ఘనంగా చేశారని వెల్లడించారు. జంపన్నవాగులో (Jampanna Vagu) నిరంతరం నీళ్లు ఉండేలా, భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు గాను రామప్ప లక్నవరం చెరువు నుంచి పైపులైన్ ద్వారా నీటిని తెస్తామని.. ఇందుకోసం నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. మొదటిసారి కేబినెట్ భేటీని ఇక్కడ నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ‘‘ఆనాడు గుడిలేని తల్లులను గుండెనిండా కొలుచుకునే తెలంగాణలోని అతిపెద్ద జాతర మేడారం జాతర. కాకతీయుల మీదనే కత్తిదూసిన వీరవనితలు సమ్మక్క, సారలమ్మ. ఆ తల్లుల దీవెనతో మేం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నాం” అని వివరించారు. సోమవారం సమక్క, సారలమ్మ గుడిని ప్రారంభిస్తామని.. భక్తులకు అంకితం చేస్తామని ప్రకటించారు. మిగిలిపోయిన పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
Read Also: జిల్లాల రీఆర్గనైజేషన్‌కు గ్రీన్ సిగ్నల్
Follow Us On : WhatsApp


