కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా సదాశివపేట (Sadashivpet) మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు (ACB Raid) నిర్వహించారు. ఈ దాడులలో మున్సిపల్ బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న నిఖిల్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇంటి పన్నుకు సంబంధించి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఇంటికి సంబంధించిన పన్ను గతంలో రూ.41 వేలు ఉండగా, అది ప్రస్తుతం రూ.1,04,000కు పెరగడంతో తాను అంత మొత్తాన్ని చెల్లించలేనని బిల్ కలెక్టర్‌ను సంప్రదించాడు.
ఈ నేపథ్యంలో పన్నును రూ.50 వేలకు తగ్గిస్తానని చెప్పి, అందుకు రూ.35 వేలు లంచంగా ఇవ్వాలని నిఖిల్ రెడ్డి డిమాండ్ చేశాడు. మొదటి విడతగా బాధితుడు రూ.20 వేలు ఇచ్చాడు. మిగతా మొత్తాన్ని కూడా ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో గురువారం ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్‌లో, మిగతా రూ.15 వేలు లంచం తీసుకుంటూ నిఖిల్ రెడ్డి పట్టుబడ్డాడు. అనంతరం అధికారులు సుమారు నాలుగు గంటల పాటు సదాశివపేట (Sadashivpet) మున్సిపల్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఈ దాడులలో ఇన్‌స్పెక్టర్లు రమేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Also: వినేష్ ఫోగట్ సెకండ్ ఇన్నింగ్స్.. కొత్త వెయిట్ కేటగిరీతో సిద్ధం!
Follow Us On : WhatsApp

