కలం, వెబ్ డెస్క్ : ఎమ్మిగనూరు (Yemmiganur) పట్టణంలోని జూనియర్ కాలేజ్ ఆవరణలో ఉన్న చెత్తకుప్పలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల కట్ట లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. కౌంటింగ్ కేంద్రానికి సమీపంలోనే ఈ బ్యాలెట్ పత్రాలు కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
సుమారు 50 బ్యాలెట్ పేపర్ల కట్టను గుర్తించిన అనంతరం, వైసీపీ ఇంచార్జ్ రాజీవ్ రెడ్డి స్వయంగా ఓ బ్యాలెట్ పేపర్‌ను ఓపెన్ చేసి మీడియాకు చూపించారు. ఆ పత్రాలపై ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వెల్లడించారు.
కౌంటింగ్ కేంద్రం సమీపంలో ఉండాల్సిన బ్యాలెట్ పత్రాలు చెత్తకుప్పలో ఎలా చేరాయని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపు భద్రతపై వారు పలు సందేహాలు వ్యక్తం చేస్తూ, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

