Mobile Popup Ad
Mobile Popup Ad

మొహర్రం వేళ భారీ కుట్ర.. వేలాది విషపు క్యాప్సూల్స్ స్వాధీనం

కలం, వెబ్ డెస్క్ : మొహర్రం (Muharram) పర్వదినాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రజలకు హాని కలిగించేలా పన్నిన ఓ భారీ కుట్రను ముంబై పోలీసులు (Mumbai Police) భగ్నం చేశారు. ఈ కేసులో సుమారు 14,900 విషపూరిత క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ క్యాప్సూల్స్‌ను మొహర్రం ఊరేగింపులో పాల్గొనే వారికి పంపిణీ చేసి భారీ విషాదానికి కారణమవ్వాలనే ఉద్దేశం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

ఈ కేసులో అరెస్టైన వ్యక్తిని ‘ఫైయాజ్ ప్రేమ్జీ’ గా గుర్తించారు. అతడు పుణెలోని విమాన్ నగర్‌కు చెందినవాడని, పెయింట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇటీవల ముంబైలోని డోంగ్రి ప్రాంతంలోని ఓ గెస్ట్ హౌస్‌లో ఉంటున్న అతడు.. జేజే, బైకుల్లా ప్రాంతాల మీదుగా వెళ్లే మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు సుమారు ’50 కిలోల జింక్ ఫాస్ఫైడ్ (ఎలుకల మందు) కొనుగోలు చేసి, అనేక రోజుల పాటు క్యాప్సూల్స్‌లో నింపినట్లు పోలీసులు గుర్తించారు.

ఒక్కో క్యాప్సూల్‌లో సుమారు ఒక గ్రాము జింక్ ఫాస్ఫైడ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొహర్రం సందర్భంగా నిందితుడు ఈ క్యాప్సూల్స్‌ను పంపిణీ చేస్తున్న సమయంలో.. ఓ వ్యక్తికి వాంతులు, కడుపునొప్పి రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకుని క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మొహర్రం ఊరేగింపునే లక్ష్యంగా చేసుకున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు బీఎన్ఎస్‌లోని  విషప్రయోగం, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మొత్తం ’30 వేల క్యాప్సూల్స్’ తయారు చేయాలనే ప్రణాళిక ఉండగా, 14,900 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో నిందితుడు 2019 నుంచి 2025 మధ్య అనేకసార్లు ఇరాన్, ఇరాక్ దేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. గత ఏడాదిలోనే 19 సార్లు ఈ దేశాలను సందర్శించినట్లు సమాచారం. ఈ ప్రయాణాల ఉద్దేశం, అతడికి మరెవరైనా సహకరించారా, ఈ ఘటన వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందా అనే కోణాలలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు నిందితుడి మొబైల్ ఫోన్, డిజిటల్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు పరిశీలిస్తూ అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>