కలం, వెబ్ డెస్క్: వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పరుగుల వరద పారించింది. కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఓపెనర్లు కీలక పాత్ర పోషించారు. రోహిత్ శర్మ, రికల్టన్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు. రోహిత్ శర్మ వికెట్ తర్వాత ముంబై పరుగుల సునామీ కాస్తంత మందగించినా.. దూకుడు మాత్రం తగ్గలేదు. బ్యాటర్లు ఆచితూచి షాట్లు ఆడుతూ స్కోర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. 221 పరుగుల కొండంత లక్ష్యం కూడా ముంబై బ్యాటర్ల ముందు చిన్నబోయింది. రోహిత్ శర్మ, రయాన్ రికెల్టన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేస్తూ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అద్భుత విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా, రహానే (67), రఘువంశీ (51) మెరుపులతో 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ అంతకంటే వేగంగా స్పందించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రయాన్ రికెల్టన్ ఆరంభం నుంచే కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రోహిత్ శర్మ తన విశ్వరూపాన్ని చూపిస్తూ కేవలం 38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేశారు. రయాన్ రికెల్టన్.. రోహిత్‌కు పోటాపోటీగా ఆడిన రికెల్టన్ 43 బంతుల్లో 4 ఫోర్లు, ఏకంగా 8 సిక్సర్లతో 81 పరుగులు బాదారు. చివర్లో సూర్యకుమార్ యాదవ్ (16), తిలక్ వర్మ (20) త్వరగా అవుట్ అయినప్పటికీ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (18), నమన్ ధీర్ (5) మరో 5 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. 19.1 ఓవర్లలోనే ముంబై 224 పరుగులు చేసి విజయం సాధించింది.
కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, సునీల్ నరైన్ తలో వికెట్ తీసినప్పటికీ, ముంబై బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు. ముఖ్యంగా వైభవ్ అరోరా 4 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకోగా, వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చారు. ముంబై బౌలర్లలో అంతకుముందు శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లతో రాణించిన విషయం తెలిసిందే. భారీ లక్ష్యాన్ని అత్యంత సునాయాసంగా ఛేదించిన ముంబై ఇండియన్స్, ఈ విజయంతో తమ బ్యాటింగ్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. ముఖ్యంగా రికెల్టన్, రోహిత్ మధ్య నెలకొన్న 148 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

