కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్రంలో ముదిరాజ్(Mudiraj) సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు రాజ్యాధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శనివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ముదిరాజుల ఐక్యతను చాటుతూ భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ముదిరాజుల ఓట్లు కోరే రాజకీయ పార్టీలు అధికారంలోనూ తగిన ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. ముదిరాజులు కేవలం ఓటు బ్యాంకుగా మిగిలిపోవడానికి సిద్ధంగా లేరని, జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో, ప్రభుత్వ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ముదిరాజులను ప్రస్తుత బీసీ-బి నుంచి తగిన బీసీ గ్రూపులోకి మార్చాలని ప్రభాకర్ ముదిరాజ్ కోరారు.
అలాగే బీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్ల నిధులు కేటాయించాలని, డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ప్రాతిపదికన ముదిరాజులకు అధిక సంఖ్యలో చట్టసభల సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముదిరాజుల (Mudiraj) రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం అత్యవసరమని నాయకులు పేర్కొన్నారు. హామీలను ఆచరణలో పెట్టాలని, హక్కుల సాధన కోసం సమాజమంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పండుగ సాయన్న సేవా సమితి అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ పాతూర్ కుమార్, మత్స్య సహకార సంఘం సొసైటీ జనరల్ సెక్రటరీ బాల, పీయూజేఏసీ ప్రకాష్ ముదిరాజ్, రాము, ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మైత్రి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
Also Read : ధోనీ నిర్ణయం షాక్‌కు గురి చేసింది: జహీర్ ఖాన్
Follow Us On : WhatsApp

