కలం, స్పోర్ట్స్: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసి, 118 పరుగుల కీలక ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) (136) అద్భుత సెంచరీతో రాణించగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (98) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. మూడో రోజు 159/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్, తొలి సెషన్లో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడింది. లంచ్ సమయానికి 239/1 స్కోరుకు చేరింది.
ఆ తర్వాత రాహుల్ (KL Rahul), దేవదత్ పడిక్కల్ (80) జోడీ కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ రెండో వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. కైల్ జేమీసన్ బౌలింగ్‌లో పడిక్కల్ బౌల్డ్ కావడంతో ఈ జోడీ విడిపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన గిల్ వేగంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. టీ విరామానికి 344/2 స్కోరుతో నిలిచిన భారత్, ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ (9 ఫోర్లు, 2 సిక్సర్లు) నాథన్ స్మిత్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఆ తర్వాత రిషబ్ పంత్‌తో కలిసి గిల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.పంత్ తనదైన శైలిలో ఎదురుదాడికి దిగి కేవలం 55 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు సెంచరీ దిశగా సాగిన గిల్ (9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆట ముగియడానికి కొద్దిసేపటి ముందు జాకబ్ డఫీ బౌలింగ్‌లో బౌల్డ్ అయి నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ 55 పరుగులతో నాటౌట్‌గా ఉండగా, నైట్‌వాచ్‌మన్ అన్షుల్ కాంబోజ్ ఖాతా తెరవకుండా క్రీజులో నిలిచాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 368 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు ఆటలో భారత బ్యాటర్లు ఆధిక్యాన్ని ఎంతవరకు పెంచుతారో చూడాలి.
Also Read : చిన్న ఏనుగుకు పెద్ద కష్టం.. విమానంలో తరలించి చికిత్స
Follow Us On: X(Twitter)

