సాగర్ గర్భంలో ఏపీ అక్రమ సొరంగం.. రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందా?: జగదీశ్ రెడ్డి

కలం, నల్లగొండ : నాగార్జునసాగర్ గర్భంలో ఆంధ్రప్రదేశ్ అక్రమ సొరంగం నిర్మిస్తుంటే గత ఎనిమిది నెలలుగా రాష్ట్ర మంత్రులు ఏం చేస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ప్రశ్నించారు. కృష్ణా జలాల వినియోగం, నాగార్జునసాగర్ నీటి తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం జలాలను తరలించుకుపోయిన ఏపీ, ఇప్పుడు సాగర్ నీళ్లపైనా కన్నేసిందని ఆరోపించారు.

ఏపీ సొరంగం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? కేఆర్‌ఎంబీ అనుమతులు ఉన్నాయా? కేంద్రం ఏం చెబుతోంది? అన్న విషయాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల వినియోగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న లెక్కలన్నీ అవాస్తవాలని జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) పేర్కొన్నారు. ఏపీ 290 టీఎంసీలకు పైగా నీటిని వాడుకుంటే, తెలంగాణకు కనీసం 40 టీఎంసీలు కూడా దక్కలేదని అన్నారు. తెలంగాణ 128 టీఎంసీలు వాడుకుందని చెబుతున్న ప్రభుత్వం, ఏ ప్రాజెక్టు నుంచి ఎన్ని నీళ్లు తీసుకుందో లెక్కలు బయటపెట్టాలని సవాల్ విసిరారు.

కేంద్రానికి, బోర్డుకు రాసిన లేఖలను జీవో నంబర్లతో సహా ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రైతుల కళ్లముందే కృష్ణమ్మ నీళ్లు కిందికి తరలిపోతుంటే మంత్రులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. సాగర్ ఎడమ కాలువ ఎండిపోతుంటే, కుడి కాలువ కింద ఏపీలో పంటలు పండించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ నీళ్లతో తెలంగాణ చెరువులను నింపే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల కంటే ఏపీ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయా అని ప్రశ్నించిన ఆయన, తెలంగాణ మంత్రులు తమ ఆత్మలను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎనిమిదేళ్ల పాటు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించామని, కానీ కాంగ్రెస్ పాలనలో ఒక్కసారి కూడా ఉదయసముద్రం అలుగు దుంకలేదని జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు. డీ-25, డీ-37, డీ-38, డీ-40 కాలువల కింది ఆయకట్టుకు నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చుక్క నీరు ఇవ్వకుండా ఆరుతడి పంటలు, కూరగాయలు ఎలా పండించాలని ప్రశ్నించారు.

మరోవైపు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు నెలల తరబడి పడిగాపులు కాస్తున్నారని, ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ప్రైవేటు వ్యాపారులు, దళారుల చేతుల్లో పెడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టి, రాష్ట్రంలో మళ్లీ వలసల పరిస్థితిని తీసుకొచ్చారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాగార్జునసాగర్‌లో మిగిలిన నీటిని కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, ఏపీకి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా తెలంగాణ హక్కులను కాపాడాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read : ఇందిరమ్మ బీమాకు మార్గదర్శకాలు విడుదల

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>