కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రేక్ పాయింట్ ఏర్పాటు చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాసర రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రేక్ పాయింట్ ఏర్పాటు ఆవశ్యకతను జీఎంకు వివరించారు.
ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే రైతులు, వ్యాపారులు, స్థానిక ప్రజలకు సరుకు రవాణాలో ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఇప్పటికే స్టేషన్‌లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటూ, అవసరమైన గూడ్స్ సైడింగ్‌తో పాటు సరుకుల లోడింగ్, అన్‌లోడింగ్ సదుపాయాలు కల్పించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఎమ్మెల్యే (Ramarao Patel) విజ్ఞప్తిపై జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతిపాదనపై సంబంధిత అధికారుల నుంచి నివేదిక తెప్పించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

