కలం, కరీంనగర్: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ( Gangula Kamalakar) కొనియాడారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే మైదానంలో గౌతమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మను ఎత్తుకొని మహిళలతో కలిసి ఆటపాటల్లో పాల్గొన్నారు. ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పూల పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని పేర్కొన్నారు. పూలనే బతుకమ్మగా పేర్చి అమ్మవారిగా భావించి పూజించడం తెలంగాణ సంస్కృతిలోని ప్రత్యేకత అన్నారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ఆడపడుచుల కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించే గొప్ప పండుగ బతుకమ్మ అని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ బతుకమ్మ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ వేడుకలకు అధికారిక గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఆడపడుచులంతా ఐక్యంగా, ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. గౌతమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో గౌతమి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గౌతమి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ గ్రంథాల సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి, కార్పొరేటర్లు గుగ్గిల్ల జయశ్రీ, నలువాల పుష్పలత రవీందర్, యూసుఫ్ అలీ, మాజీ కార్పొరేటర్లు గందె మాధవి మహేష్ ఎడ్ల సరిత, మహిళా నాయకురాళ్లు, పలువురు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

