కలం, యాదగిరిగుట్ట : భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బూట్లు విడవకుండా పదవీ అహంకారంతో పూలమాలలు వేయడం సరికాదని టీఎస్ ఎమ్మార్పీఎస్ (MRPS) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కందుల రామన్ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆలేరు రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి టౌన్ లో గల అంబేద్కర్ విగ్రహానికి బీర్ల ఐలయ్య బూట్లు విడవకుండా వెళ్లి పూలమాలలు వేయడం యావత్ జాతి ను ఖండిస్తుందని తెలిపారు. బహుజనుల బంధువు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని పదవీ వ్యామోహంతో కించపరిచేలా ఈ దుశ్చర్యానికి పాల్పడిన ఆలేరు ఎమ్మెల్యేను దళితులే కాదు యావత్ జాతి సహించబోదని హెచ్చరించారు. దళితుల పట్ల కపట ప్రేమను ఒలుకబోస్తూ ఐలయ్య నడుచుకునే క్రూరమైన సంస్కృతి భారతదేశానికి ఒక కలంకమని తెలిపారు.
భారత రాజ్యాంగంలోని ఎన్నికలచే ఎన్నికైన ప్రభుత్వ ప్రతినిధికి ఈ మాత్రం కనీస అవగాహన లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే బహుజనులందరికీ భేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలని.. లేదంటే ప్రజాక్షేత్రంలో అయిలయ్యకు తగిన బుద్ది చెప్పుతామని ఎమ్మార్పీఎస్ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో పూలేపాక బిక్షపతి, ఎంఆర్పిఎస్. నాయకులు తదితరులు పాల్గొన్నారు.

