Mobile Popup Ad
Mobile Popup Ad

బూర్గంపాడులో మృగశిర సందడి.. ఇక్కడ ఎంతో విభిన్నం!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు (Burgampadu) మండలంలో మృగశిర కార్తె సందడి నెలకొంది. ఒకవైపు ఉచిత చేప మందు పంపిణీ కార్యక్రమం సాగుతుండగా, మరో వైపు చేపల కొనుగోళ్లు జోరుగా సాగుతూ పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. చేప మందు (ఆస్తమా/దగ్గు నివారణ మందు) వేసుకునేందుకు స్థానికులే కాకుండా, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ సరిహద్దు, తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుండే క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

ముస్లిం సోదరులే పంపిణీ..

ఈసారి మృగశిర కార్తెలో చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని ముస్లిం సోదరులు దగ్గరుండి నిర్వహిస్తుండటం గమనార్హం. కులమతాలకు అతీతంగా, మానవ సేవయే పరమావధిగా భావిస్తూ, తరతరాలుగా వస్తున్న ఈ నమ్మకాన్ని కాపాడుతూ ముస్లిం సోదరులు ఈ మందును ఉచితంగా పంపిణీ చేయడం ఇక్కడి ప్రత్యేకతగా నిలిచింది. ఇది కేవలం ఆరోగ్య సంప్రదాయం మాత్రమే కాదు, సమాజంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని, మతసామరస్యాన్ని చాటిచెప్పే గొప్ప సామాజిక పరిణామంగా స్థానికులు అభివర్ణిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు చేస్తున్న ఏర్పాట్లు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.

కిటకిటలాడుతున్న చేపల మార్కెట్లు..

​బూర్గంపాడు మండల వ్యాప్తంగా చేపల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. కార్తె రోజున ఇంట్లో చేపల కూర వండుకోవడం సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. దీంతో తెల్లవారుజాము నుంచే మార్కెట్లకు కొనుగోలుదారులు పోటెత్తారు. స్థానిక చెరువులు, గోదావరి నుంచి పట్టుకొచ్చిన తాజా చేపలతో పాటు ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా భారీగానే దిగుమతి అయ్యాయి. ఈ రోజు లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతుండటంతో స్థానిక మత్స్యకారులు, వ్యాపారులకు మంచి ఆదాయం లభించనుంది. ​మొత్తంగా బూర్గంపాడులో మృగశిర కార్తె వాతావరణం ఆరోగ్యం, ఆర్థికం, సామాజిక ఐక్యతల సమ్మేళనంగా కనిపిస్తోంది. ప్రాంతీయ ఆచారంగానే కాకుండా మత సామరస్యాల కలయికతో కూడిన ఒక గొప్ప సంస్కృతికి అద్దం పడుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>