కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని పెద్ద చెరువు (Kadthal Pedda Cheruvu) కట్ట మరమ్మతు పనులను కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేయడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నప్పటికీ చెరువు కట్ట, తూము మరమ్మతు పనులు పూర్తికాకపోవడం వల్ల, రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే చెరువుకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
గత ఏడాది సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోయి రైతులు, మత్స్యకారులకు అపార నష్టం వాటిల్లింది. ఆ సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ (Nirmal Collector) అభిలాష అభినవ్ ప్రత్యేక చొరవ తీసుకుని మరమ్మతు పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. అయితే, కాంట్రాక్టర్ పనులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో అవి అసంపూర్తిగా మిగిలిపోయాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కొంత నిర్మాణం చేపట్టినా, మిగతా పనులు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ప్రారంభమయ్యే లోపు ఈ మరమ్మతులు పూర్తికాకపోతే సాగునీటి నిల్వపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ఈ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కాంట్రాక్టర్ ఒకరు.. పనులు చేసేది మరొకరు!
ఈ చెరువు కట్ట మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 14.50 లక్షల నిధులను మంజూరు చేసింది. ఈ పనులను టెండర్ ద్వారా రమేశ్ అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. అయితే, ఆ తర్వాత ఆయన ఈ పనులను మరొక సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. సదరు వ్యక్తికి ఈ తరహా పనుల్లో తగిన అనుభవం లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిజానికి చెరువు కట్ట, తూము మరమ్మతు పనులు ఈ వేసవికాలంలోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే పనులు నిలిచిపోయాయి. చెరువు కట్ట వద్ద ఉన్న తూము నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు, కట్టకు గండ్లు పడకుండా మట్టి పనులు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆ పనులు పూర్తికాలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో రూ.75 లక్షల నిధులు..
సమైక్య రాష్ట్రంలో చెరువులను నిర్లక్ష్యం చేశారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం 2015లో ‘మిషన్ కాకతీయ’ పథకం కింద ఈ గ్రామ పెద్ద చెరువుకు రూ. 75 లక్షల నిధులను కేటాయించింది. ఆ నిధులతో చెరువు పూడికతీత, కట్ట, తూములు, మత్తళ్లను బలోపేతం చేయాల్సి ఉంది. అయితే అప్పట్లో పనులను నాణ్యతతో చేయకపోవడం వల్లే, గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట మళ్లీ తెగిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు కింద ఉన్న ఆయకట్టు రైతుల పంట పొలాల్లోకి ఇసుక మేటలు చేరడంతో సుమారు 500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వారు వాపోతున్నారు.
పనులు పూర్తి చేసి, రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: గుర్రం రాము, సర్పంచ్
గ్రామంలోని పెద్ద చెరువు కట్ట తెగిపోవడంతో రైతులకు, మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట పొలాల్లోకి వెళ్లే రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. పొలాల్లోకి చెరువు నీరు చేరడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. గతంలో వ్యవసాయ అధికారులు వచ్చి సర్వే చేసినప్పటికీ, ప్రభుత్వం నుంచి రైతులకు నష్టపరిహారం మాత్రం ఇప్పటివరకు అందలేదు. అధికారులు వెంటనే స్పందించి చెరువుకట్ట మరమ్మతు పనులతో పాటు, దెబ్బతిన్న రహదారి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. అలాగే నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలి.
Read Also: సీఎం రేవంత్ హిట్లర్ కన్నా ఎక్కువ.. ఆయన తాలిబన్: కవిత
Follow Us On: Instagram

