కలం, కరీంనగర్ బ్యూరో: మంచిర్యాల అభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ చేసిన వ్యాఖ్యలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Vamsi Krishna Gaddam) ఘాటుగా స్పందించారు. కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెద్దపల్లి పార్లమెంట్ పరిధి, మంచిర్యాల జిల్లాకు ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.”పదేళ్లు అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి ఒక్క పెద్ద ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారా? అభివృద్ధి గురించి మాట్లాడే ముందు మీ పనితీరు ఏమిటో ప్రజలకు వివరించండి” అంటూ బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. అభివృద్ధి చేసే దమ్ము లేకపోయినా, ఇతరులు అభివృద్ధి చేస్తే ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్లమెంట్‌లో నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ ప్రాంతానికి నిధులు, ప్రాజెక్టులు సాధిస్తున్నానని పేర్కొన్నారు.
“కార్పొరేట్ కంపెనీలు నడపడం కాదు… మంచిర్యాల అభివృద్ధి కోసం ఎప్పుడైనా కేంద్ర మంత్రులను, అధికారులను కలిశారా?” అని ప్రశ్నించారు. తాను చేస్తున్న కృషి ఫలితంగానే పలు అభివృద్ధి పనులు పురోగతి సాధిస్తున్నాయని స్పష్టం చేశారు. తన తాత కాకా వెంకటస్వామి, తండ్రి వివేక్ వెంకటస్వామి చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు తనను ఆశీర్వదించారని, అదే కొందరు బీజేపీ నాయకులకు అసహనంగా మారిందని విమర్శించారు.”దమ్ముంటే ఒక ఎన్నిక గెలిచి చూపించండి… ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చి చూపించండి… ఆ తర్వాత విమర్శలు చేయండి” అంటూ సవాల్ చేశారు. ప్రెస్‌మీట్లు, విమర్శలతో కాలక్షేపం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులపై దృష్టి పెట్టాలని, ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయొచ్చుగానీ అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. చివరగా, “సొల్లు కబుర్లు ఆపి అభివృద్ధిపై ఫోకస్ చేయండి.. ప్రజల సంక్షేమమే మా లక్ష్యం” అంటూ బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

