పెట్రోల్, డీజిల్ కొరతలను తక్షణమే తీర్చాలని ఎంపీ వద్దిరాజు ఆదేశం

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణలోని పలు జిల్లాల్లో తీవ్రంగా వేదిస్తున్న పెట్రోల్, డీజిల్ కొరతలపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, పెట్రోల్, సహజ వాయు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju Ravichandra) స్పందించారు. ఆయా కంపెనీల సరఫరాదారులు, ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడి పెట్రోల్ డీజిల్ కొరతలను తక్షణమే తీర్చాలని ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్రను పలువురు పెట్రోల్ బంక్ ల యజమానులు, అసోసియేషన్ ప్రతినిధులు కలిసి పెట్రోల్, డీజిల్ సరఫరాలో జరుగుతున్న జాప్యం, బంకుల్లో ఏర్పడుతున్న కొరత గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఆయన అక్కడి నుంచే ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్నటి నుంచి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకోవడంతో రైతులు, చిరుద్యోగులు, వ్యాపారస్తులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆయా కంపెనీల ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు.

బంకుల యజమానులు డీడీలు చెల్లించినా కూడా ఆయిల్ సరఫరా చేయకుండా జాప్యం ఎందుకు చేస్తున్నారని ఆయన వారిని ప్రశ్నించారు. రేట్ల హెచ్చుతగ్గులను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఆయిల్ కొరత ఇలాగే కొనసాగితే తెలంగాణలో సమస్యలు తీవ్రమవుతాయని ఆయన సరఫరా కంపెనీలకు వివరించారు. తక్షణమే పెట్రోల్ డీజిల్ కొరతను నివారించాలని, సరఫరా వేగవంతం చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులు.. సోమవారానికల్లా సమస్యను అధిగామిస్తామని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఎంపీ రవిచంద్రకు బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>