కలం, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు చొప్పదండి ఎమ్మెల్యే (MLA) మేడిపల్లి సత్యం సూచించారు. గంగాధర మండలం హిమ్మత్ నగర్, రంగారావుపల్లి, ఉప్పర మల్యాల, కురిక్యాల, మధురానగర్, గంగాధర బూరుగుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని కేంద్రాలకు తీసుకువచ్చిన వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురి కావద్దని పేర్కొన్నారు.
వెంటనే మిల్లులకు తరలించాలి..
రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి, వారి బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో దమ్మని రాము, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, సింగల్ విండో మాజీ ఛైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, సర్పంచులు బీర్ల ఆనందం, దాసరి శంకరయ్య, రేండ్ల శ్రీనివాస్, కడారి రేణుక కనకయ్య, వేముల భాస్కర్, పడాల భాగ్యలక్ష్మి రాజన్న, సాగి అజయ్ రావు, మేర్జ కొండయ్య, కర్ర బాపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

