కలం, నల్లగొండ: నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి (Raghuveer Reddy) స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధి కోసం మంత్రులు, ఎమ్మెల్యేలతో పోటాపోటీగా పని చేస్తున్నామని ఆయన వెల్లడించారు. నల్లగొండలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో తాజాగా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వీలుగా ప్రతి వారం రెండు రోజుల పాటు నల్లగొండ హెడ్‌క్వార్టర్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎంపీ ప్రకటించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలి పర్యటనతో జిల్లాలో అభివృద్ధి పనులకు మరింత వేగం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాలో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. నల్లగొండ అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ప్రసక్తే లేదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో అనుకున్న అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాకే, ఆ ప్రగతిని చూపించి మళ్లీ ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడుగుతామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల బృందం పూర్తి సమన్వయంతో పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని ఎంపీ రఘువీర్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్ రెడ్డి, బాలునాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎంపీని కలిసి శుభాకాంక్షలు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

