కలం, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలవడంతో పాటు హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక కార్యక్రమం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) పేర్కొన్నారు. మూసీ నది (Musi River)ని కాలుష్య రహితంగా మార్చి పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తున్నదన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, పునరావాసం, పరిహారం తదితర అంశాలపై సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమగ్ర సమీక్ష సందర్భంగా పై అంశాలను వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూరదృష్టితో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టారని, నగరానికి కొత్త జీవం పోయడమే కాకుండా పర్యాటకం, ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన, పర్యావరణహిత జీవన వాతావరణాన్ని అందించే సంకల్పంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వివరించారు.
మూసీ కాలుష్యం కారణంగా దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షాకాలంలో వరదలతో పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు రూపొందించామన్నారు. వరద నియంత్రణ, నీటి శుద్ధి, పచ్చదనం విస్తరణ, రహదారులు, పార్కులు, వాక్‌వేలు, వినోద కేంద్రాల అభివృద్ధితో మూసీ పరివాహక ప్రాంతాలను కొత్త జీవన కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
భూసేకరణ ప్రక్రియలో ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యంగా ఉండాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రతి నిర్ణయం మానవీయ దృక్పథంతో ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి వెంటనే అమలు చేయాలని సూచించారు.
భూములు కోల్పోయే వారికి చట్టబద్ధమైన పరిహారం, అవసరమైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని మంత్రి స్పష్టం చేశారు. భూసేకరణ నుంచి పునరావాసం వరకు ప్రతీ దశ పారదర్శకంగా, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సాగాలన్నారు. అభివృద్ధి, మానవీయత రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖతో పాటు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, హెచ్‌ఎండీఏ, సంబంధిత జిల్లాల కలెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు.

