కలం, ఖమ్మం బ్యూరో: బీఆర్ఎస్ పాలకులు తమ స్వార్థం కోసం ఆర్థిక, సామాజిక దోపిడీకి పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వెంకటేశ్వర స్వామిని సతీసమేతంగా దర్శించుకుని, ధ్వజస్తంభ ప్రాణప్రతిష్ట మహా కుంభాభిషేక ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి, రూ.8 లక్షల కోట్ల అప్పులను మిగిల్చిందని ధ్వజమెత్తారు. గత పాలకులు ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడుతూ రాక్షసానందం పొందారని, ప్రజల సంపదను దోచుకున్న డబ్బుతో మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజా ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ‘మాధవ సేవే – మానవ సేవ’ లక్ష్యంగా, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ముందుకు సాగుతోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. నిరుపేదల ఇళ్ల నిర్మాణం కోసం రూ. 22,500 కోట్లతో ఒకేసారి 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. అలాగే పేద కుటుంబాలు నాణ్యమైన ఆహారానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో 1.06 కోట్ల కుటుంబాలకు ప్రతి వ్యక్తికి 6 కేజీల చొప్పున ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.
గృహ జ్యోతి పథకం కింద 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అలాగే 30 లక్షల పంప్‌సెట్లకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని, ఇందుకోసం ఏటా రూ. 14,000 కోట్లు డిస్కమ్‌లకు చెల్లిస్తున్నామని వివరించారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇప్పటివరకు ఇందుకోసం ఆర్థిక శాఖ రూ. 10,600 కోట్లు చెల్లించిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచామని, రాబోయే ఐదేళ్లలో లక్ష కోట్లకు పైగా రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.
గతంలో అస్తవ్యస్తంగా మారిన ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచి పేదలకు భరోసా కల్పించామన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డైట్, కాస్మోటిక్ చార్జీలను భారీగా పెంచడంతో పాటు, ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే 27 లక్షల మంది విద్యార్థుల కోసం ఉదయపు ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. గత పదేళ్లలో ఒక్క గ్రూప్-1 పరీక్ష కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్ తీరుకు భిన్నంగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయడమే కాకుండా దాదాపు 76,000 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేసిందని భట్టి విక్రమార్క వెల్లడించారు.
రాష్ట్రంలో సంస్కృతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, ఆలయాల అభివృద్ధి కోసం రూ. 2,216 కోట్లు కేటాయించామని, సమ్మక్క-సారలమ్మ లాంటి దేవాలయాలను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తూ.. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రూ. 90,000 కోట్లతో రహదారుల పనులను మంజూరు చేశామన్నారు. హైదరాబాద్‌కు పోటీగా అంతర్జాతీయ స్థాయిలో “ఫ్యూచర్ సిటీ”ని నిర్మిస్తున్నామన్నారు.
మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు రాష్ట్రాన్ని కోర్ అర్బన్, పెరి అర్బన్, రూరల్ రీజియన్ ఎకానమీగా విభజించి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతామని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, తదితర సీనియర్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

