కలం, నిర్మల్: మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆధునిక సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవాలని ఎంపీ గోడం నగేష్ (MP Godam Nagesh) సూచించారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎఫ్ఎస్సిఎస్ కన్వెన్షన్‌లో ఆత్మ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళాను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ఎంపీ గోడం నగేష్ ప్రారంభించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని సూచించారు. వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బెట్టను తట్టుకునే రకాలు, తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలు, పంట మార్పిడి విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులు పంటల ఎంపిక సమయంలో వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ పరిస్థితులు, విత్తనాల లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని తెలిపారు. దేశంలో వంటనూనెలతో పాటు ఇతర వ్యవసాయ ముడి సరుకుల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశీయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని ఆయిల్‌పామ్ సాగును మరింత విస్తరించాలని రైతులకు సూచించారు. నిర్మల్ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు మంజూరైన రెండు ట్రాలీ ఆటోలను లబ్ధిదారులు అనిత, లక్ష్మిలకు ఎంపీ, కలెక్టర్ అందజేశారు. రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల రైతు బీమా చెక్కును అందించారు.

