కలం, కరీంనగర్ బ్యూరో: దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్, సీబీఎస్ఈ పరీక్షల వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ (Gaddam Vamsi Krishna) విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలు రాస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం వారి భవిష్యత్తును గాలికి వదిలేసిందని మండిపడ్డారు. నీట్ పరీక్షల్లో వరుసగా బయటపడుతున్న పేపర్ లీకులు, అక్రమాలు దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థుల్లో తీవ్ర అనుమానాలు కలిగిస్తున్నాయని అన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల రీవ్యాల్యూయేషన్, ఫలితాలపై వస్తున్న ఫిర్యాదులు కూడా విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. 12వ తరగతి విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని ఎంపీ పేర్కొన్నారు.
విద్యా శాఖ మంత్రిదే బాధ్యత..
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్, సీబీఎస్ఈ పరీక్షల విషయంలో వెంటనే విద్యార్థులకు సమాధానం చెప్పాలని ఎంపీ గడ్డం వంశీ కృష్ణ డిమాండ్ చేశారు. ఈ పరిణామాలపై నైతిక బాధ్యత వహించాలన్నారు. ప్రధాని మోదీ ప్రతి అంశాన్ని రాజకీయంగా చూసే బదులు దేశ యువత భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులు ప్రశ్నిస్తే విమర్శించడం కాదు, వారి ఆందోళనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఎంపీ స్పష్టం చేశారు.

