ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి : ఎంపీ చామల

కలం, భువనగిరి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై బీఆర్ఎస్, బీజేపీలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారాలను కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు వేదిక ఏదైనా గట్టిగా తిప్పికొట్టాలని భువనగిరి ఎంపీ, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) పిలుపునిచ్చారు. గాంధీ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల వైఖరిని, కేంద్ర ప్రభుత్వ పక్షపాత విధానాలను ఆయన తీవ్రంగా నిరసించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలపై ప్రతిపక్ష నేతలు అర్ధసత్యాలు, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనల్లో యుకేకి అనుమతి ఇచ్చి, అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణకు రావాల్సిన సెమీకండక్టర్ పరిశ్రమలను గుజరాత్ రాష్ట్రానికి తరలించారని ఆరోపించారు. హైదరాబాద్ పురోగతికి కీలకమైన మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ ప్రాజెక్టులను బీఆర్ఎస్, బీజేపీలు ఉమ్మడిగా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో 8.7 కోట్ల మంది యువత విద్య, నైపుణ్య శిక్షణకు దూరంగా ఉన్నారని గుర్తుచేశారు. యువతకు సరైన శిక్షణ లేనప్పుడు “వికసిత్ భారత్” సాధించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేస్తుంటే, రాష్ట్ర అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయన్నారు. గతంలో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు సుద్దులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ రాకూడదనే ఏకైక లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ తమ ఉనికిని కోల్పోయినా సరే బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా అత్యంత కీలకమైన శక్తిగా మారిందని, ప్రధాని మోదీ నుంచి సామాన్య నాయకుడి వరకు అందరూ దీనిని ఉపయోగిస్తున్నారని చామల పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందు ఎంత కష్టపడ్డామో, ఇప్పుడు ఆ అధికారాన్ని కాపాడుకోవడానికి అంతే బాధ్యతతో పనిచేయాలన్నారు. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌గా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను నిరంతరం పరిశీలిస్తానని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగానే తిప్పికొట్టాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>